- మల్లన్నను దర్శించుకోనున్న చంద్రబాబు
- భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు
నల్లగొండ, జూలై 31 (విజయక్రాంతి): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు సుండిపెంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. గంట పాటు ఆలయంలో పూజ కార్యక్రమా ల అనంతరం 11.45 గంటలకు శ్రీశైలం ప్రాజె క్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు వాయనం సమర్పించి, జలహారతి ఇస్తారు. అక్కడి నుంచి 12 గంటల తరువాత సుండిపెంట కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకొని నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులుతో సమావేశం కానున్నారు. 12.30 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి అనంతపురం వెళ్లనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి శ్రీశైల ముఖద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, నంది సర్కిల్, వీవీఐపీ అతిథి గృహం పరిసరాలు, కొత్తపేట సుండిపెంట స్పీచ్ యాడ్, లింగాల గట్టు, ఆనకట్ట, పవర్ ప్రాజెక్టు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాలను 11 సెక్షన్లుగా విభజించి ప్రాంతానికి 100 మంది పోలీసులను భద్రతా దృష్ట్యా కేటాయించామని ఎస్పీ తెలిపారు.