న్యూఢిల్లీ: ఢిల్లీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు బుధవారం ఆయన స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద జరిగిన ప్రార్థన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, బీజేపీ మిత్రపక్షాలైన జేడీ(యూ)కి చెందిన లాలన్ సింగ్, (హెచ్ఏఎం)ఎస్‌కు చెందిన జితం రామ్ మాంఝీ తదితరులు సదైవ్ అటల్ వద్ద అంజలి ఘటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు వాజ్‌పేయి దత్తత కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
''భారతజాతి గర్వించదగిన నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది. సగర్వంగా తలెత్తుకు నిలబడుతున్నది. 'నేషన్ ఫస్ట్' అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నాను.'' అంటూ చంద్రబాబు ఎక్స్ లో పోస్టు చేశారు.