- కమిషన్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ప్రీతి సుధాన్
- ఆమె 1983 ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి
- కేంద్ర సర్వీసుల్లోనే ఎక్కువగా పనిచేసిన ప్రీతి
న్యూఢిల్లీ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ క్యాడర్ బ్యూరోక్రాట్‌కు దేశంలోనే అత్యున్నతమైన పదవుల్లో ఒకటైన యూపీఎస్సీ చైర్‌పర్సన్ పదవి లభించింది. 1983 ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సుధాన్‌ను యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. సుధాన్ 2020 జూలైలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. 2022లో యూపీఎస్సీ సభ్యురాలిగా నియమితులయ్యారు. యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఆమె 2025 ఏప్రిల్ వరకు కొనసాగుతారు. యూపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మనోజ్ సోనీ రాజీనామా చేయటంతో సుధాన్‌ను ఆ పదవిలో నియమించారు. మనోజ్ సోనీ పదవీకాలం 2029 వరకు ఉండగా, ఐదేండ్ల ముందే ఆయన పదవిని త్యజించారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.
సమర్థవంతమైన అధికారి సుధాన్
బ్యూరోక్రాట్‌గా దాదాపు 37 ఏండ్ల అనుభవం ఉన్న ప్రీతి సుధాన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకొన్నారు. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఫిల్, సోషల్ పాలసీలో ఎంఎస్సీ చేశారు. 1983లో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించి, ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. అయితే, ఆమె కెరీర్‌లో ఎక్కువకాలం కేంద్ర సర్వీస్‌లోనే పనిచేశారు. ఆమె కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడే దేశాన్ని కొవిడ్ మహమ్మారి చుట్టుముట్టింది. ఆ సమయంలో కొవిడ్ నివారణకు కీలక చర్యలు తీసుకొన్నారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రక్షణ శాఖల కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు.