calender_icon.png 23 October, 2024 | 8:44 PM

దీపావలి కానుక.. ఏటా మూడు ఉచిత సిలిండర్లు

23-10-2024 06:59:48 PM

అమరావతి,(విజయక్రాంతి): తెలుగుదేశం సర్కారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిపి కబురు చెప్పింది. దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

అక్టోబర్ 31న సిలిండర్ డెలివరీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 31వ తేదీకి 3-4 రోజుల నుంచి బుకింగ్ ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 1 నుంచి జులై నెలాఖరు వరకు తొలి సిలిండర్ పంపిణీ, ఆగస్టు 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు రెండో సిలిండర్ పంపిణీ, డిసెంబర్ నుంచి మార్చి 31 వరకు మూడో సిలిండర్ పంపిణీ చేయనున్నట్లు నాదేండ్ల వెల్లడించారు. ఉచిత సిలిండర్లపై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అమలులో భాగంగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లో తిరిగి వారి ఖాతాల్లో జమావుతుందని నాదెండ్ల చెప్పారు. జమ కాకుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాదికి రూ.2700 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.