అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక గందరగోళ పరిస్థులు నెలకున్నాయని ఆరోపించారు. పతనం అంచున రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఉందన్నారు. రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణం నేటి తరం చేతుల్లో ఉందని ఆయన వెల్లడించారు. సరళ ప్రభుత్వం.. ప్రభావంత పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను దుర్వినియోగం చేసింది, రాష్ట్ర వనరులను దారి మళ్లించిందని విమర్శించారు. గత ప్రభుత్వం లోపభూయిష్ట విధానాల వల్ల ఆదాయానికి గండి పడిందని తెలిపారు. గత ప్రభుత్వం పన్నులను దారి మళ్లించిందని పయ్యావుల పేర్కొన్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించిన రుణాలు అధిక వడ్డీకి తీసుకుంది.. కేంద్ర పథకాల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదలరంగం పతనమైందన్న మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ హయాంలో ఇంధనరంగం విధ్వంసం జరిగిందన్నారు.