తెలంగాణ గడ్డమీద టీడీపీకి పూర్వ వైభవం తెస్తాం
టీటీడీపీలో యువ రక్తాన్ని ప్రోత్సహిస్తా
అధికారం లేకపోయినా కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు
నేను చేసిన అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొనసాగించాయి
తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి
గొడవలు పెట్టుకుంటే నీళ్లు కూడా రావు
సానుకూల చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్‌లో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి):- ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నాకు రెండు కళ్లలాంటివి. నాడు రాష్ట్ర విభజన సమయంలోనూ ఇదే మాట చెప్పిన. రెండు ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన ఏకైక పార్టీ టీడీపీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని నాడు ఆలోచించా. నేడు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టువరకు ఇదే ఆలోచిస్తా’ అని ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఆదివారం తొలిసారి హైదరా బాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కువరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రస్టు భవన్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు వారినుద్దేశించి మాట్లాడారు. తెలుగుజాతికి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గౌరవం తెచ్చారని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణలో కరణం, పటేల్, పట్వారీ వ్యవస్థలను ఎన్టీఆర్ రద్దు చేశారని, అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేయడంతో తమకు స్వాతంత్య్రం వచ్చిందన్నట్లు ఇక్కడి ప్రజలు పండగ చేసుకున్నారని చెప్పారు.
తెలుగు గడ్డపైనే ఎన్టీఆర్, పీవీ పుట్టడం అదృష్టం
రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన వర్గాలు బాగు పడ్డాయంటే అది ఎన్టీఆర్ చొరవతోనే అని చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో సంక్షేమానికి నాంది పలికి ఏకైన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగుజాతి ఎప్పుడూ మర్చిపోదన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. పీవీ దేశానికి దశదిశను చూపారని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంతోపాటు సంపద సృష్టి ఆయన కాలంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్టీఆర్, పీవీ తెలుగు గడ్డపైనే పుట్టడం మన అదృష్టమని తెలిపారు. రాజకీయమంటే సొంత వ్యాపారం చేసుకోవడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాదని, ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమని వీరిరువురూ నిరూపిం చారని పేర్కొన్నారు.
ఉత్సాహం తగ్గలేదు
తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు అవుతున్నా..కార్యకర్తల్లో పట్టుదల ఏమాత్రం తగ్గలేదని చంద్రబాబు అన్నారు. 2004 నుంచి 2024 వరకు అధికారంలో లేకున్నా.. టీడీపీ పట్ల కార్యకర్తల్లో రోజురోజుకూ అభిమానం పెరుగు తోందని తెలిపారు. నాయకులు పార్టీని వీడారు కానీ, కార్యకర్తలు మాత్రం జెండాని విడవలేదని ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం జెండా ఈ ప్రాంతంపై రెపరెపలాడుతుందని స్పష్టంచేశారు.
హైటెక్ సిటీతోనే అభివృద్ధి
తనను ఏ కారణం లేకుండా జైల్లో పెట్టారని, ఆ సమయంలో హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు చూపిన చొరవ ఎప్పుడూ మర్చిపోలేనని చంద్రబాబు తెలిపారు. తన అరెస్టుకు నిరసనగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే.. లక్షల మంది వచ్చి మద్దతుగా నిలిచారని చెప్పారు. తాను చేసిన అభివృద్ధికి సంఘీభావం తెలిపిన ఆ సంఘటనతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. విదేశాల్లో కూడా తనకు తెలుగువాళ్లు మద్దతుగా ర్యాలీలు తీశారని గుర్తు చేశారు. ‘1995కు ముందు ఒక్కసారి హైదరాబాద్‌ను గుర్తు చేసుకోండి. హైటెక్ సిటీతో హైదరాబాద్‌లో అభివృద్ధి ప్రారంభమైంది. ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ అయ్యింది. టీడీపీ చూపిన చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఒక రాజకీయ నాయకుడికి దీనికి మించిన తృప్తి ఏం కావాలి? నాడు ఔటర్ రింగ్ రోడ్డు పనులను కూడా నేనే ప్రారంభించాను. నాలెడ్జ్ ఎకానమీకి టీడీపీనే నాంది పలికింది’ అని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అభినందనలు
1995 నుంచి 2004 వరకు తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొనసాగించాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పు డు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. నాటి అభివృద్ధిని కొసాగిస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ‘ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏపీలో టీడీపీ సర్కారు ఉంది. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు కలవకున్నా.. తెలుగు ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే శనివారం చర్చలు జరిగాయి. ఆ చర్చలు మరింత మందుకెళ్తాయని ఆశిస్తున్నా. నేను సీఎం అవగానే రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు పరిష్కరించుకుందామని రేవంత్ రెడ్డికి లేఖ రాశా.
ఆ లేఖకు ఆయన సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదా లు. రాష్ట్రాలు విడిపోయినా.. సమస్యలపై అన్నదమ్ముల్లా పోరాడి ఐకమత్యంగా ఉండాలి. మన జాతి ఒక్కటే. మాట్లాడే భాష ఒక్కటే. భాషను, జాతిని కాపాడుకోవాలి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 42 మంది ఎంపీలు ఉండేవారు. రాష్ట్రాలు విడిపోవడంతో ఆ సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. ఏ సమస్య వచ్చినా జాతి ప్రయోజనాలను కాపాడటానికి నేను ముందుంటాను’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని కొందరు అనుకుంటున్నారని, కానీ ఘర్షణ వల్ల ఎలాంటి లాభం జరగదని పేర్కొన్నారు. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావని, సమస్యలు పరిష్కారం కావని, అభివృద్ధి జరగదని, దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. సానుకూల చర్చల ద్వారానే ముందుకు నడవాలి అని హితవు పలికారు. అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ.. రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే అంతకంటే ఉత్తమం మరొకటి లేదని సూచించారు. రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి త్వరలో కమిటీ వేస్తామని తెలిపారు. రాజకీయాలు ఎలా ఉన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు.
1995 నాటి సీబీఎన్‌ను చూస్తారు
ప్రజలు 2024 సీబీఎన్‌ను కాదని, ఇక 1995 నాటి చంద్రబాబును చూస్తారని టీడీపీ అధినేత అన్నారు. 1995లో ఏ విధంగా పని చేశానో అదేవిధంగా ఇప్పుడు పని చేస్తానని తెలిపారు. నాడు హైదరాబాద్‌లో 90 రోజుల పాటు ఆకస్మిక తనిఖీలతో తెల్లవారుజామున తిరిగి సమస్యలు పరిష్కరించానని గుర్తుచేశారు. శ్రమదానం, జన్మభూమితో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సైబరాబాద్ నిర్మించి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఏ నాయకుడికీ ఇవ్వని గౌరవం తెలుగుజాతి తనకు ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, తనకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని పేర్కొన్నారు.
‘తెలుగు నేలపై నేను తిరగని ప్రాంతం లేదు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు నాకు తెలియని ఊరు లేదు. తన జీవితంలో చివరి రక్తం బొట్టు వరకూ ప్రజలకు ఏం చేయాలో చేస్తూనే ఉంటాను’ అని ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో యువతకు అవకాశాలు కల్పిస్తే.. ప్రజలు బ్రహ్మరథం పట్టారని, టీడీపీ చరిత్రలో ఇంతటి విజయం మునుపెన్నడూ చూడలేదని అన్నారు. సునామీలో విధ్వంసకర ప్రభుత్వం కొట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో రాజులు, నియంతలు లేరని, విర్రవీగితే ఎక్కడికి పంపాలో ప్రజలకు బాగా తెలుసని వైసీపీకి చురకలంటించారు.
తెలంగాణలో ఇప్పుడేసే పునాది 30 ఏళ్లు ఉంటుంది
తెలంగాణలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలున్నారని, మళ్లీ యువతను ప్రోత్సహిస్తానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో యువ రక్తాన్ని ప్రోత్సహిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షానే ఉంటామని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లలకు చదువు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలనే యావ తనకు ఎప్పుడూ లేదని అన్నారు. పార్టీ నిర్మాణం కోసం ఇప్పుడు వేసే పునాదే మళ్లీ 30 ఏళ్లు పాటు ఉంటుందని తెలిపారు. ఏపీలో పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని గుర్తుచేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి పొత్తు ప్రకటించారని చెప్పారు. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు ఎన్నికల్లో బాగా పని చేశాయని అన్నారు. ‘తెలంగాణ నుంచి ఎన్నికల ముందు 70 రైళ్లలో ఏపీకి వచ్చి ప్రజలు ఓట్లు వేశారు. చిన్న పనులు చేసుకునేవారు కూడా వచ్చి ఓట్లు వేశారు. వారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు’ అని భావోద్వేగంగా చెప్పారు.
విధ్వంసాన్ని భూస్థాపితం చేస్తాం
ఏపీలో సైకో కాదు, ఒక భూతం ఉందని చంద్రబాబు అన్నారు. తాను పెట్టిబడిదారులను ఆహ్వానిస్తే..‘మీపై నమ్మకం ఉంది. కానీ మీ రాష్ర్టంలో ఒక భూతం ఉంది’ అని అంటున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ భూతాన్ని రాజకీయంగా పూర్తిగా భూ స్థాపితం చేస్తామన్నారు.
శాపనార్థాలు పెట్టారు
తాను హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని కొందరు వక్రీకరించి మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. తాను హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశానని, అందువల్లే రాష్ట్రం విడిపోయిందని కొందరు శాపనార్థాలు పెట్టారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. ముందు రాజధాని అభి వృద్ధి చెందాలని తాను ఆ రోజు ఆలోచించానని చెప్పారు. రాజధాని అభివృద్ధి చెందితే అది మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆ రోజే తాను చెప్పానని గుర్తు చేశారు.
విజన్-2020 అంటే అప్పుడు ఎగతాళి చేశారు
విభజన సమయంలో తెలంగాణ-ఏపీ మధ్య తలసరి ఆదాయ వ్యత్యాసం 35 శాతంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. అప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం చాలా మెరుగ్గా ఉందని, దానికి కారణం హైదరాబాద్ నగరం అన్నారు. అయితే 2014లో తాను సీఎం అయ్యాక... 2019 వరకు కష్టపడి ఆ వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తగ్గించానని తెలిపారు. 2019లో వచ్చిన విధ్వంస ప్రభుత్వం వల్ల మళ్లీ 44 శాతానికి పెరిగిందని విమర్శించారు. విభజనతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వ పాలన వల్లే ఎక్కువ నష్టం కలిగిందని ఆరోపించారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టం తెలంగాణ అని గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ఒక స్థాయికి వచ్చిందని, ఇప్పుడు ఏపీ ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు.
‘నేను ఎప్పుడో 2020 విజన్ గురించి మాట్లాడాను. నాడు కొందరు దాన్ని ఎగతాలి చేశారు. నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే.. మొబైల్స్ తిండి పెడుతాయా? అన్నారు. హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందా? అని అడిగారు. ఇప్పుడు వాళ్ల పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా మారుతుంది. వికసిత్ భారత్‌లో నంబర్‌వన్‌గా తెలంగాణ, ఏపీ ఉంటాయి. తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేయడం కాదు, ఎంప్లాయిమెంట్ ఇచ్చే స్థాయికి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లోకెల్లా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు. అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగువారు. అందుకే అన్ని వ్యవస్థల్లో తెలుగువారు గ్లోబల్ లీడర్స్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.