రైతు వద్ద రూ.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు
వికారాబాద్, డిసెంబర్ 23(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు రూ. 5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వివరాలు.. తాండూరు మండ లం దుద్యాల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పట్టాభూమి అధికారుల తప్పిదంతో ధరణిలో తప్పుగా నమోదైంది.
అట్టి భూమిని సరిచేయాలని బాధిత రైతు తాండూరు ఆర్డీవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు పనికావాలంలే రూ. 5లక్షలు లంచం ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయ ఏవో, సీనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశారు. అందుకు ఒప్పుకున్న బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు.
సోమవారం సాయంత్రం పొద్దుపోయాక డబ్బులు ఏవో దాన య్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావుకు బాధిత రైతు ఇస్తుండగా అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు తెలిపారు.