calender_icon.png 23 December, 2024 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరిదీ వైఫల్యం?

17-10-2024 12:53:44 AM

టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన హర్మన్ సేన

జట్టు ప్రక్షాళనకు సమయం ఆసన్నం

కెప్టెన్సీ రేసులో మంధాన, రోడ్రిగ్స్

* ‘గత మూడేళ్లలో ఇదే అత్యుత్తమ జట్టు. జట్టులోని 12 మంది ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈసారి టీ20 ప్రపంచకప్ సాధించి తీరుతాం’.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మెగాటోర్నీకి ముందు పలికిన వ్యాఖ్యలివి. కానీ ప్రపంచకప్ ప్రారంభమయ్యాకా పరిస్థితి పూర్తిగా తారుమారైంది. అంచనాలకు భిన్నంగా భారత్ గ్రూప్ దశకే పరిమితమైంది. దీంతో మహిళల జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందా? హర్మన్ స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరం.

విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరోసారి నిరాశపరిచింది. గత మూడు పర్యాయాల్లో ఒకసారి రన్నరప్.. మరో రెండుసార్లు సెమీస్ చేరిన టీమిండియా ఈసారి మాత్రం గ్రూప్ దశకే పరిమితమైంది.

వరుసగా మూడు మెగా టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టుపై ఈసారి మంచి అంచనాలున్నాయి. హర్మన్, మంధాన, రోడ్రిగ్స్ లాంటి సీనియర్ క్రికెటర్లకు తోడు డబ్ల్యూపీఎల్‌తో యువ రక్తం తోడవ్వడంతో ఈసారి కప్ గెలుపుపై ధీమా ఉండేది.

ఏడాది కాలంగా దూకుడైన ఆటతీరును ప్రదర్శించిన హర్మన్ సేనకు ప్రపంచకప్ జరిగిన యూఏఈ వాతావరణం, అక్కడి పిచ్‌లు భారత్‌కు అనుకూలమంటూ ప్రచారం జరగడంతో ఈసారి మెగా టోర్నీలో ఫేవరెట్‌గా మారింది.

హర్మన్ కథ ముగిసినట్లే?

టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమితో భారత్ అవకాశాలు సన్నగిల్లాయి. కానీ ఆ తర్వాత పాకిస్థాన్‌పై చచ్చీ చెడీ గెలిచిన టీమిండియా శ్రీలంకపై భారీ విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో లైన్‌లోకి వచ్చినట్లే అనిపించిన భారత్ ఆసీస్ చేతిలో ఓటమితో పరిస్థితి మళ్లీ మొదటికి తెచ్చుకుంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది.

2009 ఆరంభ టీ20 ప్రపంచకప్ నుంచి ప్రతీ టోర్నీ ఆడుతూ వచ్చిన హర్మన్ విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 35 ఏళ్ల హర్మన్ కథ దాదాపుగా ముగియడంతో కెప్టెన్సీ రేసులో ఉన్న మంధాన, రోడ్రిగ్స్‌లలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చూడాలి. కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అమోల్ మజుందార్ మెరుగు పర్చాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.