- ప్రారంభించిన ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌరసేవలు
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ఆర్టీసీ, మెట్రో, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో టికెట్ల కోసం ఇకపై క్యూలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క క్లిక్‌తో అన్ని రకాల టికెట్లను పొందేలా తెలంగాణ ప్రభుత్వం ‘మీ టికెట్’ పేరుతో యాప్‌ను రూపొందించింది. తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ఈ యాప్‌ను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు సుపరి పాలన అందించాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు తెస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో సంబంధిత నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల టికెట్ బుకింగ్స్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైకి తెచ్చేందుకు వీలుగా ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు.
రాబోయే రోజుల్లో ఈతరహా యాప్‌లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తా మని వెల్లడించారు. ఈ యాప్‌లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను పొందొచ్చని మంత్రి వివరించారు.
జీహెఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లను కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యూపీఐ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లను పొందొచ్చని వివరించారు. ఇతర ప్లాట్‌ఫాంల మాదిరిగా ఈ యాప్‌లో అదనంగా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయబోమని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ‘మీ సేవ’ కమిషనర్ రవికిరణ్, పరిశ్రమల శాఖ కమిషనర్ డా. జీ మల్సూర్, జూపార్క్స్ డైరెక్టర్ డా. సునీల్ పాల్గొన్నారు