calender_icon.png 23 September, 2024 | 1:56 PM

శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే

23-09-2024 11:54:43 AM

కోలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠగా సాగిన త్రిముఖ పోరులో చివరకు మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే పై చేయి సాధించారు. రాజప క్సే కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయి మార్క్సిస్టు విధానాలపై మొగ్గు చూపే దిసనాయకేను శ్రీలంక ప్రెసిడెంటుగా ఎన్నకున్నారు. 42.31 శాతం ఓట్లు సాధించిన దిసనాయకే తొలుత 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున(జేవీపీ)లో చేరి తన రాజకీయ పునాది నిర్మించుకున్నారు.

విద్యార్థి నేతగా మెదలై దేశాధినేతగా ఎదిగిన దిసనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు.1968 నవంబర్ 24న కోలంబో సమీపంలోని తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్య చదివిన దిసనాయకే తన గ్రామంనుంచి తొలి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. బ్యాచులర్  అఫ్ సైన్స్ లో పట్టభద్రుడైన ఆయన తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ లో చే రి విద్యార్థి రాజకీయాల్లో్ కీలక పాత్ర పోషించడం ద్వారా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాగా  దిసనాయకే  సోమవారం  శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.