08-04-2025 12:44:22 AM
మేడ్చల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మల్కాజిగి రిలోని అను కృష్ణ ఆస్పత్రి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సోమవారం కలెక్టర్ గౌతమ్ ఆదేశాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి .ఉమా గౌరీ ఆధ్వర్యంలో ఆస్పత్రిని తనిఖీ చేయగా విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. పిసి పిఎన్డిటి సర్టిఫికెట్ గడువు ముగిసినప్పటికీ కొత్తది తీసుకోకపోవడం, డాక్టర్ల అర్హత తప్పుగా చూపించి రోగులను మోసం చేయడం, అనధికారికంగా అల్ట్రా సౌండ్ యంత్రాన్ని వినియోగించడం వంటివి బయటపడ్డాయి.
అంతేగాక పారామెడికల్ సిబ్బందికి లైసెన్స్ లేకపోవడం, పాలి క్లినిక్ లో అనధికార వైద్య ప్రాక్టీస్ వంటివి గుర్తించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యానికి రూ. ఐదు లక్షల జరిమానా విధించారు. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ 60 రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేశారు.
యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అన్ని వైద్య పరికరాలు, డయాగ్నొస్టిక్ ఉపకరణాలు జప్తు చేశారు. తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా గత నెలలోనూ ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో కూడా లోపాలు బయటపడ్డాయి. స్కానింగ్ మిషన్ ను సీజ్ చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి నిర్వహణలో మార్పు రాలేదు.