calender_icon.png 23 October, 2024 | 11:03 AM

నటుడు రాజ్‌తరుణ్‌కు ముందస్తు బెయిల్

09-08-2024 12:53:05 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్‌లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో నిందితుడైన సినీ హీరో నిడమర్తి రాజ్‌తరుణ్‌కు గురువారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. లావణ్య ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోరుతూ రాజ్‌తరుణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది పీ విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ లావణ్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 2008లో విశాఖలో రాజ్‌తరుణ్‌తో పరిచయం అయిందని, రెండేళ్ల తరువాత ప్రేమిస్తున్నానని చెప్పారని, తరువాత పదేళ్లకు పెళ్లి చేసుకున్నామని పేర్కొన్నట్టు తెలిపారు. రాజ్‌తరుణ్ అప్పులు తీర్చడానికి రూ.70 లక్షలు ఇచ్చినట్లు లావణ్య తెలిపినట్లు పేర్కొన్నారు. తనను మోసం చేశాడని బావాజీ మస్తాన్‌రావు అనే వ్యక్తిపై లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారని గుర్తుచేశారు.

రాజ్‌తరుణ్‌తో లావణ్యకు పెళ్లి అయినట్లయితే మస్తాన్‌రావు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని 2023లో ఆమె ఎలా ఫిర్యాదు చేశారని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తులో ఉందని, దర్యాప్తు పూర్తయితేగాని వాస్తవాలు వెలుగులోకి రావని అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు లావణ్య గుంటూరులోను ఇలాంటి ఫిర్యాదే ఇచ్చారని, అలాంటప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారన్నదానిపై స్పష్టత లేదని తెలిపారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తరువాత రాజ్‌తరుణ్‌కు ముందస్తు బెయిలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. లావణ్య ఇంప్లీడ్ పిటిషన్‌ను తిరస్కరించారు.