07-04-2025 12:46:13 AM
నేనంటే నేను అంటున్న ప్రజాప్రతినిధులు
ఇంతకీ మంజూరు ఎవరు చేసినట్టు?
అయోమయంలో ప్రజలు
జుక్కల్ ఎప్రిల్ 6 (విజయక్రాంతి) : జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రం నుంచి రుద్రూర్ బోధన్ నిజాంబాద్ వరకు మంజూరు అయిన నేషనల్ హైవే 161ఏ రోడ్డు పనులు నేనంటే నేను మంజూరు చేయించాను అని మాజీ ఎంపీ బీబీ పాటిల్, ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుల మధ్య సభ సమావేశాలలో పేర్కొనడం కలకలం రేగుతోంది.
2025 మార్చి 11న నిజాంసాగర్ లో జరిగిన ఒక సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తన హయాంలోనే మంజూరు అయిందని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కి, రాష్ర్ట మంత్రికి విన్నవించడం ద్వారా ఈ రోడ్డు పనులకు 156 కోట్లు అయ్యాయని చెప్పడం జరిగింది. అయితే ఇది తప్పు అని బిజెపి నాయకులు నెల క్రితమే ఖండిస్తూ గతంలో బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న సమయంలోనే మంజూరు చేయించినట్లు మాజీ ఎంపీ బీబీ పాటిల్ వర్గీయులు కూడా మద్నూర్ లో ప్రెస్ మీట్ ఇచ్చారు. అయితే ఈ వార్తలను చూసి ప్రజలు ఎవరు మంజూరు చేయించారు.
అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నా లేకుంటే మాజీ ఎంపీ బీబీ పాటిల్ మంజూరు చేయించిందా అనేది చాలామందికి తెలియకుండా పోతుంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య ఈ విధంగా రోడ్డు విషయం కొనసాగుతుండగా ప్రజలకు మాత్రం ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వారు చెప్తున్నారు.
మద్నూర్ నుంచి వయా రుద్రూర్ మీదుగా బోధన్ వరకు ఈ నాలుగు లైన్ల రోడ్డు నేషనల్ హైవే 161ఏ పనులకు మొత్తం రూ. 750 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం రూ.429 కోట్లు మంజూరైనట్లు సమాచారం. అయితే ఈ రోడ్డు పొడవు 38 కిలోమీటర్లు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్న దాంట్లో రూ.156 కోట్లు మంజూరైనట్లు చెప్పడంతో అందరూ అయోమయంలో ఉన్నారు.
అసలు ఎవరు మంజూరు చేయించారు, ఎవరి హయాంలో జరిగింది, ఎంత మంజూరు జరిగింది అనేదానిపై క్లారిటీ లేకపోవడంతో దిక్కుతోచడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై గత నెల రోజులుగా నేనంటే నేను అని చెప్పుకోవడంతో సందిగ్ధత నెలకొంది.
ఎవరు మంజూరు చేయించిన పనులు జరిగితే అదే సంతోషం అని కూడా కొందరు భావిస్తున్నారు. కానీ క్రెడిట్ కోసం ఇద్దరు ప్రజలు ప్రజాప్రతినిధులు పాకులాడటమే విడురంగా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.