calender_icon.png 24 September, 2024 | 4:51 AM

ప్రభావహీనంగా యాంటీబయాటిక్స్!

24-09-2024 02:31:28 AM

  1. కొన్ని బ్యాక్టీరియాల్లో పెరుగుతోన్న నిరోధకత

న్యూమోనియా, టైఫాయిడ్‌కు కష్టమవుతోన్న చికిత్స

మందుల వాడకంపై నియంత్రణ అవసరం

ఐసీఎంఆర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కొన్ని వ్యాధులను సాధారణంగా ఉపయోగించే యాంటీ బయాటిక్స్ ఎదుర్కోలేకపోతున్నాయి. ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. అందువల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ), బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి కొన్ని వ్యాధుల చికిత్స కష్టతరంగా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా సాధారణ యాంటీ బయాటిక్స్‌కు స్పందించకపోవడమే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ (ఏఎంఆర్‌ఎస్‌ఎన్) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ అధ్యయనం న్యూమోనియా, సెప్సిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, డయోరియా వంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీబయాటిక్‌లపై దృష్టి సారించింది. 

నిరోధకత పెరుగుతోంది

2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య భారత్‌వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, క్లినిక్‌లలోని ఔట్ పేషెంట్లు, ఐసీయీలను కవర్ చేస్తూ సేకరించిన డాటా ఆధారంగా వివరణాత్మకంగా రిపోర్టును ఐసీఎంఆర్ సిద్ధం చేసింది. ఈణూ క్లెబ్సియెల్లా న్యూమోనియా, సూడోమోనాస్ ఏరుగినోసా, స్టాఫిలాకాకస్ ఆరేస్ వంటి బ్యాక్టీరియాలపై యాంటీబయాటిక్స్ పనితీరుపై పరీక్షలు నిర్వహించారు. రక్తం, మూత్రం, శ్వాసకోశాలతో సహా శరీరంలోని ఇతర భాగాల నుంచి నమూనాలు సేకరించారు. సెపోటాక్సిమ్, సెఫ్టాజిడిమ్, సిప్రోఫ్లోక్సాసిన్, లెవోఫ్లోక్సాసిన్ వంటి అనేక యాంటీబయాటిక్స్ ఈ వ్యాధులపై 20 శాతం మాత్రమే పని చేసినట్లు అధ్యయనంలో తేలింది. ఈ యాంటీబయాటిక్‌లకు నిరోధకత పెరుగుతోందని గుర్తించింది. 

నియంత్రణ అవసరం

అనేక యాంటీబయాటిక్స్ ప్రభావం కాలక్రమేణా తగ్గిపోతోందని నివేదిక వెల్లడించింది. పైపెరాసిలిన్-టాజోబాక్టమ్ 2017లో 56 శాతం ప్రభావం చూపగా 2023లో 42 శాతానికి పడిపోయింది. సాల్మొనెల్లా టైఫీ వంటి గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా ఫ్లోరోక్వినోలోన్‌కు 95 శాతం నిరోధకత చూపిస్తున్నట్లు ఐసీఎంఆర్ పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ రెసిస్టె న్స్ పెరుగుదల ముప్పును పరిష్కరించడానికి తక్షణ చర్యల కోసం నివేదిక పిలు పునిచ్చింది. యాంటీబయాటిక్స్ వాడకంపై కఠినమైన నియంత్రణ అవసర మని పేర్కొంది. వ్యవసాయంలోనూ యాంటీబయాటిక్స్ దుర్వినియోగంపై ఐసీఎంఆర్ హెచ్చరించింది. మానవు లు, జంతువుల ఆరోగ్యానికి అవసరమైన యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని సంరక్షించడానికి బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.