calender_icon.png 25 October, 2024 | 11:55 AM

ప్రజాపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు

15-07-2024 12:23:31 AM

మధ్యాహ్న భోజన కార్మికులను అడ్డుకున్న పోలీసులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 14: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం పేరుతో భద్రత కిట్ల పంపిణీకి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మధ్నాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా రేవంత్‌రెడ్డి గమనించి అడ్డుకోవద్దని సూచించారు.

స్థానిక ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకోవాలని ఆదేశించారు. సభ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ను సీఐటీయూ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని మరలా అడ్డుకున్నారు. అనంతరం సీఐటీయూ నాయకులు స్వప్న, ఏర్పుల నర్సింహ, కార్మికులు మాట్లాడుతూ.. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం తమను అడ్డుకోవడం తగదన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పగించొద్దని డిమాండ్ చేశారు. ఆ సంస్థకు ఇస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. వారివెంట జిల్లా నాయకులు పోషమోని కృష్ణ, ఎల్లయ్య, గణేష్, మధ్యాహ్న భోజన కార్మికులు లక్ష్మమ్మ, నిర్మలమ్మ, రమాదేవి, రంగమ్మ, పుష్ప, స్వరూప, రాజమణి ఉన్నారు.