19-02-2025 07:04:47 PM
బడ్జెట్ ను ప్రజలకు అనుకూలంగా మార్చాలి..
సంగారెడ్డి లో బడ్జెట్ ప్రతుల దగ్ధం..
సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు..
సంగారెడ్డి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే బడ్జెట్ గా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు విమర్శించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ నమూనా బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ప్రధాని మోడీ రైతు బడ్జెట్ అంటూనే రైతు రుణమాఫీకి తగిన బడ్జెట్ కేటాయించలేదన్నారు. విద్యుత్ సంస్కరణలతో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం నష్టం జరుగుతుందన్నారు.
ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించారని, కార్మికులను బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయలేదన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో పేదలు, కార్మిక, కర్షకులకు, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 8 మంది బీజేపీ ఎంపీ లు ఉన్న తెలంగాణ కు బడ్జెట్ లో మొండి చేయి ఇచ్చిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, అదానీ, అంబానీలకు అనుకూలంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ను ప్రజలకు అనుకూలంగా సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు, మాణిక్యం, నర్సిములు, నాయకులు అశోక్ బాలరాజ్, రమేష్, అలీ దత్తు తదితరులు పాల్గొన్నారు.