calender_icon.png 9 October, 2024 | 11:55 AM

ఎన్సీకి పూర్వవైభవం

09-10-2024 01:14:10 AM

జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అధికారం

ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలుపు

29 సీట్లతో సంపూర్ణ మెజారిటీ

29 సీట్లతో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ

శ్రీనగర్, అక్టోబర్ 8: దాదాపు పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తన పూర్వవైభవాన్ని సాధించింది. కాంగ్రెస్, సీపీఎంతో కలిసి కూటమిగా పోటీచేసిన ఈ పార్టీ సొంతంగానే 42 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

90 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో హంగ్ ఏర్పడు తుందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను ఫలితాలు తప్పని నిరూపించాయి. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజారిటీ సాధించాయి.

జమ్ములో పట్టు నిలుపుకొన్న బీజేపీ మరింత బలపడి 29 సీట్లు గెలిచింది. కాగా, కింగ్ మేకర్ అవుతామని భావించిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) మూడు సీట్లకే పరిమితమైంది. అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇక్కడ ఖాతా తెరువటం విశేషం. ఇతర స్థానిక పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి.

కశ్మీర్‌లో ఎన్సీ, జమ్ములో బీజేపీ

జమ్ముకశ్మీర్‌లో దాదాపు పదేండ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014లో ఈ ప్రాంతం రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, రాష్ట్ర హోదా తొలగించి జమ్ముకశ్మీర్, లఢక్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటుచేసింది.

తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ఎన్సీ, బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. జమ్ముకశ్మీర్‌లో రెండు భిన్న ప్రాంతాలున్నాయి. ఒకటి కశ్మీర్ లోయ కాగా, రెండోది జమ్ము. లోయలో 47, జమ్ములో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో లోయలో ఎన్సీ, జమ్ములో బీజేపీ స్పష్టమైన ఆధిపత్యం చూపాయి.

ఎన్సీతో పొత్తు పెట్టుకొని బలం పెంచుకోవాలని భావించిన కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. ఆ పార్టీ ఆరు సీట్లలో మాత్రమే గెలుపొందింది. పీడీపీ మూడు చోట్ల గెలువగా, ఆప్ దోడా స్థానంలో గెలిచి ఖాతా తెరిచింది. ఏడుచోట్ల స్వతంత్రులు గెలిచారు.  

ఒమర్ అబ్దుల్లాయే సీఎం: ఫరూఖ్

ఎన్నికల ఫలితాలు వెలువడగానే జమ్ముకశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశాన్ని ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా తేల్చేశారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించారు. 

పీడీపీ, కాంగ్రెస్ ఢమాల్

ఈ ఎన్నికల్లో అత్యధికంగా నష్టపోయింది పీడీపీ అయితే, అధికంగా లాభపడింది ఎన్సీ. 2014 ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 25 సీట్లు కోల్పోయింది. పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా బిజ్‌మెహరా స్థానంలో ఎన్సీ అభ్యర్థి బషీర్ షా వీరి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

బీజేపీకి నాడు 25 సీట్లు రాగా, ఈసారి మరో 4 పెంచుకొన్నది. కాంగ్రెస్ మాత్రం ఎన్సీ మద్దతు ఉన్నా ఉపయోగించుకోవటంలో విఫలమైంది. 2014లో కాంగ్రెస్ 12 సీట్లలో గెలువగా, ఈసారి సగం కోల్పోయింది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా, ఇటీవల కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ 5 మంది ఎమ్మెల్యేలను నామినేట్ చేయవచ్చు. దీంతో మెజారిటీ మార్క్ 46 నుంచి 48కి పెరిగింది.  

ఓట్ల శాతంలో బీజేపీనే ఫస్ట్

సీట్లపరంగా ఎన్సీ అతిపెద్ద పా ర్టీగా అవతరించినప్పటికీ ఓట్ల పరం గా బీజేపీనే ముందున్నది. ఈ పార్టీకి మొత్తం 25.63 శాతం ఓట్లు వచ్చా యి. రెండో స్థానంలో నిలిచిన ఎన్సీకి 23.44 శాతం ఓట్లు వచ్చాయి. కాం గ్రెస్‌కు 11.97 శాతం, పీడీపీకి 8.87 శాతం ఓట్లు పోలయ్యాయి.