08-02-2025 12:00:00 AM
హైదరాబాద్: దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు భారతీయ చిత్ర సీమకు చేసిన అపారమైన సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. శుక్రవా రం పార్లమెంట్ హౌస్ లో ప్రధాని మోదీని ఏఎన్‌ఆర్ తనయుడు అక్కినేని నాగార్జున కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ, రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీకి నాగార్జున అందజేశారు. సినీ రంగంలో ఏడు దశాబ్దాల ఏఎన్‌ఆర్ సుదీర్ఘ ప్రస్థానాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. చెన్ను నుంచి హైదరాబాద్‌కు తెలుగు చిత్రపరిశ్రమను తరలించడంలో ఆయన పాత్రను కొనియాడారు.
ఏఎన్‌ఆర్ నటుడిగానే కాకుండా, విద్య, సాహిత్యం, ప్రజా సేవలోనూ విశేషమైన కృషి చేసిన గొప్ప వ్యక్తి అని మోదీ కొనియాడారు. ఏఎన్‌ఆర్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాల నిర్మాణానికి ముఖ్య కేంద్రంగా నిలిచిందని, విద్యారంగానికి చేసిన సేవలలో భాగంగా గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వంటి అనేక విద్యా సంస్థలను అభివృద్ధి చేశారన్నారు.
ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ 117వ ఎపిసోడ్‌లో తపన్ సినా, రాజ్ కపూర్‌లతో పాటు ఏఎన్‌ఆర్‌కు అర్పించిన నివాళిని మరోసారి గుర్తు చేశారు. భారతీయ సినిమా గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది భారత్‌లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌న్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.