calender_icon.png 28 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో వనజీవి.. ఇందూరు జనార్దన్

14-07-2024 05:42:12 AM

  • 16 ఏండ్లుగా పర్యావరణ సేవలో..   
  • 2.5 లక్షల మొక్కలు నాటిన నిజామాబాద్ వాసి
  • మొత్తం 12.5 లక్షల మొక్కలు నాటించిన జనార్దన్ 
  • మొక్కల కోసం ప్లాట్లను అమ్ముకున్న పర్యావరణ ప్రేమికుడు

నిజామాబాద్, జూలై 13 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ఓ సామాన్యుడు నడుం బిగించాడు. తన సొంత ఖర్చులతో  ఇప్పటి వరకు దాదాపు రెండున్నర లక్షల మొక్కలు నాటాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన రావుట్ల జనార్దన్ 22 ఏండ్ల క్రితం నిజామాబాద్ నగరానికి వచ్చి ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి ఉపాధి పొందుతున్నాడు. వృత్తిరీత్యా ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నా.. ప్రవృత్తి రీత్యా మాత్రం పర్యావరణ ప్రేమికుడు.

జిల్లాలో అడవులను నరికివేయడం ఆపాలని ప్రచారం చేస్తూ 2009 నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాడు. మొదట అటవీ, మైదాన ప్రాంతాల్లోని పండ్ల చెట్ల నుంచి గింజలు సేకరించి మొక్కలను పెంచి నాటడం ప్రారంభించాడు. అయితే ఈ పద్ధతిలో అధిక సంఖ్యలో మొక్కలు నాటడం సాధ్యం కాదని భావించాడు. తాను సేకరించిన పండ్ల గింజలతో సీడ్ బాల్స్ తయారు చేయించాడు. వాటిని వర్షాకాలంలో అటవీప్రాంతంలో చల్లడం ప్రారంభించాడు. ఈ పద్దతిలో కోతుల వంటి జంతువులకు అడవిలోనే పండ్లు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాక అవి జనావాసాల్లోకి రావడం ఆగిపోతుందని జనార్దన్ చెప్తున్నారు.  

విద్యార్థులు, అధికారుల సాయంతో..  

ఏడాది పొడవునా అటవీ, జనావాసాల్లో సీతాఫలం, అల్లనేరేడు, చింత, జామా, సపోట, మామిడి, వేప లాంటి చెట్ల గింజలను ఆయన సేకరిస్తున్నారు. కొన్నిసార్లు కూ లీలను పెట్టి గింజలను సేకరిస్తున్నారు. మరికొన్ని సంద ర్భాల్లో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ, జైళ్ల శాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నా రు. విద్యార్థులు, ఖైదీలు, స్వచ్ఛంద సేవకుల సహాయంతో బంకమట్టి, చెరువు మట్టి, గింజలను వినియోగించి సీడ్‌బాల్స్ తయారీ చేయిస్తున్నారు. ఇలా తయారు చేసిన బంతులను ఎండబెట్టి నిల్వచేసి, వర్షాకాలంలో వా టిని అటవీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సేవకుల సహాయంతో అటవీప్రాంతంలో వెదజల్లుతారు.  

ఇప్పటివరకు ఐదు లక్షల సీడ్ బాల్స్ 

ఈ సంవత్సరం మొస్రా అటవీప్రాంతంలో 30 వేల సీడ్ బాల్స్‌ను ఆయన జల్లిం చారు. కొన్ని సంవత్సరాలుగా 30 వేల నుం చి లక్షకు పైగా సీడ్స్ బాల్స్‌ను వివిధ ప్రాం తాల్లో చల్లారు. సారంగాపూర్ అటవీ ప్రాం తంలో మూడుసార్లు, మల్లారంలో నాలుగు సార్లు, ఇందల్వాయిలో నాలుగు సార్లు, చిన్నాపూర్‌లో రెండు సార్లు, మొస్రాలో రెండుసార్లు, కులాస్‌పూర్‌లో ఒకసారి, ఇలా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అడవుల్లో దాదాపు ౫ లక్షల సీడ్ బాల్స్‌ను చల్లారు. అలాగే మామిడి మొక్కలను అటవీ ప్రాంతంలో నాటారు. వీటితోపాటు మరో 50 సంచుల పండ్ల మొక్కల విత్తనాలను అటవీ ప్రాంతంలో చల్లారు. 

మొక్కల కోసం ప్ల్లాట్ల అమ్మకం  

మొక్కలు నాటేందుకు జనార్దన్ ఎవరి నుంచి చందాలు, డబ్బులు తీసుకోడు. వీటన్నింటిని తన సొంత ఖర్చుతోనే చేస్తున్నాడు. ఇందుకోసం తనకున్న ఇరవై లక్షల విలువైన రెండు ప్లాట్లను సైతం అమ్ముకున్నాడు. 16 సంవత్సరాలుగా సీడ్ బాల్స్ తయారీ, కూలీలను నియమించుకోవడం, ట్రాన్స్‌పోర్ట్ తదితర వాటి కోసం అయ్యే ఖర్చులను సొంతంగానే భరిస్తున్నారు. అవసరమైతే తాను చేసే సేవలో శ్రమశక్తిని అందించాలని, వివిధ చెట్ల గింజలను సేకరించి ఇవ్వాలని కోరుతున్నారు. డబ్బులు తీసుకుంటే తాను చేసే పనికి విలువ ఉండదని ఆయన అభిప్రాయం. కుటుంబ ఆస్తులను అమ్ముతూ తమకు ఆసులేమీ లేకుండా చేశాడంటూ అతని భార్య, పిల్లలు నిందిస్తున్నా తన మొక్కల పెంపకం వ్యాపకాన్ని మాత్రం వదులుకోనని చెప్పారు. అందుకే స్థానికులు అతన్ని గ్రీన్ జనార్దన్ అంటూ గర్వంగా పిలుచుకుంటున్నారు. 

వనజీవి రామయ్య ఆదర్శం

మొక్కలు పెంచడంలో నాకు వనజీవి రామయ్య ఆదర్శం. రోజురోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం నన్ను మొక్కలు నాటేందుకు పురిగొల్పింది. సమాజంలో ప్రతి వ్యక్తి పర్యా వరణం పట్ల కనీస బాధ్యతను కలిగిఉండాలి. చెట్లు లేకుంటే మానవుని మనుగడ కష్టం. అందుకే ప్రతి వ్యక్తి మొక్కలు నాటడం తన బాధ్యతగా భా వించాలి.  జీవితాంతం చెట్లు పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటా. 

 జనార్దన్ పర్యావరణంపై పుస్తకం

మొక్కల పెంపకంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిరివెన్నెల గ్రీన్ సొసైటీ అనే సం స్థను స్థాపించారు జనార్దన్. ‘చెట్లు, పర్యావరణం, కాలుష్యం’పై ఓ పుస్తకం సైతం రాశారు. ఇం దులో పర్యావరణం, మొక్కలు పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించారు, సొంత ఖర్చులతో 15 వేల కాపీలు పబ్లిష్ చేసి ప్రజలకు పంచారు. ఆయన ఏదైనా శుభ కార్యానికి వెళితే మొక్కలనే బహుమతిగా ఇస్తుండటం విశేషం. అవకాశం ఉంటే అక్కడే వారితో మొక్కలు నాటిస్తున్నారు.