* తిరుపతిలోని మోహన్‌బాబు వర్సిటీలో మనోజ్‌ను అడ్డుకున్న పోలీసులు
* భారీ బందోబస్తు మధ్య తాతయ్య, నాయనమ్మ సమాధులకు నివాళి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (విజయక్రాంతి): సీనియర్ సినీ నటుడు మంచు మోహన్‌బాబు, అతడి చిన్నకొడుకు మంచు మనోజ్ మధ్య గత కొన్నిరోజులుగా స్తబ్దుగా ఉన్న వివాదం మరోసారి ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలోని.. తాత నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించేందుకు మంగళవారం అక్కడికి వెళ్లిన మంచుమనోజ్ ను తిరుపతి పోలీసులు యూనివర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోర్టు ఉత్తర్వ్యుల నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతిలేదని పోలీసులు మనోజ్‌ను నిలువరించారు. జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్తానని మనోజ్ చెప్పడంతో పోలీసులతో జరిపిన చర్చల అనంతరం మనోజ్ దంపతులు ఇద్దరు పోలీసు బందోబస్తు మద్య తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్, అతడి అన్న విష్ణుకు సంబంధించిన బౌన్సర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.