12-04-2025 12:00:00 AM
‘మల్లేశం’, ‘8ఏఎం మెట్రో’ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన వాస్తవ ఘటనల ప్రేరణతో రూపొందించిన మరో ప్రాజెక్టు ‘23’. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. ఝాన్సీ, పావోన్ రమేశ్, తాగుబోతు రమేశ్, ప్రణీత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.
‘కోసీ కొయ్యంగానే.. కోడికూత మానేసి.. కైలాసమూ నేను పోయినానంటదే.. ఆ మాటలంటదే.. కోడిపిల్లా..’ అంటూ సాగే ఈ జానపదాన్ని రచయిత గతంలోనే ఆడియో రూపంలో తీసుకొచ్చారు. జానపద కళాకారుడిగా వరంగల్ శంకర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ అలనాటి జానపదం ఇప్పటికీ తెలంగాణ పల్లెజనం నాలుకలపై నానుతుంటుంది. ఇప్పుడు అదే పాట సినిమాలో వినియోగిస్తుండటం గొప్ప విషయం.
సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ తనదైన శైలిలో కంపోజ్ చేయగా, రేలా జాన్ ఆలపించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి; మాటలు: ఇండస్ మార్టిన్; సాహిత్యం: చంద్రబోస్, రెహమాన్, సింధు మార్టిన్; ప్రొడక్షన్ డిజైన్: లక్ష్మణ్ ఏలే; ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్లా; ఎడిటర్: అనిల్ ఆలయం.