calender_icon.png 1 October, 2024 | 6:53 PM

బుల్డోజర్లపై సుప్రీం మరో తీర్పు

01-10-2024 12:34:30 AM

కూల్చివేతలపై అస్సాంకు నోటీసులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: సుప్రీంకోర్టు ఆదేశాలను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిం దని పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్కడి కామరూప్ మెట్రో డిస్ట్రిక్ట్ పరిధిలోని సోనపుర్ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ పరిశీలించింది.

మూడువారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలు ఆపాలంటూ బెంచ్ ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టొద్దని సెప్టెంబర్ 17న సుప్రీం జారీ చేసిన ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందని న్యాయవాది హౌజెఫా అహ్మది వెల్లడించారు.

సోనపుర్‌లో అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్ చేసి కూల్చివేతలు మొదలు పెట్టినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు ఇండ్లను కూల్చబోమని పేర్కొన్నారని, అయినా కూల్చివేతలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

సోనపుర్‌లోని కచుతొలి పథార్ లో నివసిస్తున్న 47 కుటుంబాలు అసలైన భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి.. పవర్ ఆఫ్ అటార్నీలు పొంది అక్కడ జీవిస్తున్నట్లు అధికారులకు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం అక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు దిగారనేది బాధితుల ప్రధాన ఆరోపణ.