20-03-2025 06:50:49 PM
పిట్లంలో కుట్టుమిషన్ల పంపిణీ..
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణతో పాటు కుట్టుమిషన్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళలు వంటింటి పనులకు మాత్రమే పరిమితం కాకుండా, తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
మహిళా సాధికారత లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ, రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అదనంగా, మహిళలు చదువు మధ్యలో ఆపకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని, వారి విద్యతో కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని సూచించారు. పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సామాజిక న్యాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి చారిత్రాత్మక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి ఫలితమని, ఈ చారిత్రాత్మక ఘట్టంలో శాసన సభ్యుడిగా భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.