calender_icon.png 24 September, 2024 | 8:04 PM

నైపుణ్య విద్యలో మరో ముందడుగు

24-09-2024 12:28:05 AM

  1. బీఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసిన ప్రభుత్వం
  2. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు యత్నం
  3. ఏడాదికి 10 వేల మందికి శిక్షణ
  4. మినీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్  

హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): విద్య, నైపుణ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి సర్కార్  మరో ముందడుగు వేసింది. డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్,  ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని ఐటీ, ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. తెలంగాణ యువతకు ఆ సెక్టార్‌లో శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. సాధారణ డిగ్రీతో పాటు బీఎఫ్‌ఎస్‌ఐ డిగ్రీని కూడా అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ), బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియం(బీఎఫ్‌ఎస్‌ఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రత్యేకంగా బీఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ ప్రోగ్రామ్.. 

బీఎఫ్‌ఎస్‌ఐ డిగ్రీ కోర్సులు చాలా ఖరీదైనవి. ప్రపంచంలోని పేరొందిన కంపెనీలు ఒక్కో విద్యార్థిపై రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేసి శిక్షణ ఇస్తాయి. ఈ కోర్సులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో శిక్షణ పొందిన విద్యార్థి ఎక్కువ ప్యాకేజీ ఇచ్చే సంస్థలోకి వెళ్తుడటం.. గ్లోబల్ కేపాబులిటీ సెంటర్లకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో అంతటి డిమాండ్ ఉన్న కోర్సులను తెలంగాణ విద్యార్థులకు అందిం చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ కోర్సులను 2024 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన 20 డిగ్రీ, 18 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ ప్రోగ్రామ్ అమలవుతోంది.

అది సత్ఫలితాలను ఇవ్వడంతో పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కొన్నేళ్లుగా ప్రపంచంలోనే పేరొందిన హెచ్‌ఎస్‌బీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ట్రీట్, మాస్ మ్యూచివల్, లండన్ స్టాక్ ఎక్చేంజీ లాంటి బీఎఫ్‌ఎస్‌ఐ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5లక్షల వరకు ఉద్యోగులను సృష్టించాయి. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లోని ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ కేంద్రంగా గుర్తించాయి. 

ఈ క్రమంలో ఆ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా ఉంటాయని రేవంత్ రెడ్డి సర్కారు అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం ఈ రంగంలో ఉద్యోగాల డిమాండ్ భారీగా ఉన్నందున ఈ సెక్టార్‌లో నైపుణ్య కోర్సులు అందించాలని సర్కారు నిర్ణయించింది.

సీఎస్‌ఆర్ నిధులతో 10 వేల మందికి శిక్షణ

బీఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 వేల మంది ఇంజినీరింగ్, 5 వేల మంది నాన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ కోర్సును తొలి విడతగా ప్రభుత్వం నేర్పించనున్నారు. రివాల్వింగ్‌తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్) నిధులతో ఈ కోర్సును అందించాలని సర్కార్ నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంపై కూడా పెద్దగా భారం పడదని భావిస్తున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ మినీ డిగ్రీ ప్రోగ్రామ్ నిర్వహణ కోసం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈక్విప్ అనే సంస్థను ఎంపిక చేశారు. అటు బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఈక్విప్ సంస్థ ముందుకొచ్చింది. తొలి విడత కింద ఈ సంస్థ రూ.2.5కోట్లను ఖర్చు పెట్టనుంది. ప్రతీ ఏడాది 10 వేల మంది విద్యార్థులకు మూడేళ్ల పాటు రివాల్వింగ్ ఫండ్‌ను ఈ సంస్థ సమీకరిస్తుంది.