calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సిగలో మరో సోలార్ ప్లాంట్

11-04-2025 12:00:00 AM

  1. బొగ్గు ఉత్పత్తిలో మూస విధానాలకు స్వస్తి
  2. అప్‌డేట్ అవుతున్న సింగరేణి
  3. ప్రత్యామ్నాయ రంగాలపై ఆసక్తి
  4. బెల్లంపల్లి, మందమర్రిలో సోలార్ ప్లాంట్లు

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 10 : సింగరేణి బొగ్గు పరిశ్రమ పురోగతికి యాజమాన్యం ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తోంది. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ మూస పద్ధతికి స్వస్తి పలికింది. కంపెనీ నాలుగు కాలాలు సజీవంగా ఉండేందుకు బహుళ విధానాలు అవలంభిస్తూ సరికొత్త దిశగా అడుగులు వేస్తుంది.

ఒక వైపు బొగ్గు ఉత్పత్తిలో ఆధునికతను అందిపుచ్చుకొంటూనే, మరోవైపు సింగరేణి ప్రగతికీ సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకి సంకల్పించింది. అందులో భాగంగానే జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ప్రాం తాల కేంద్రంగా నూతనంగా సోలార్ ప్లాం ట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు పనులు వేగంగా సాగుతున్నాయి.

సింగరేణి భవిష్యత్తు కోసం ఇతర రంగాలవైపు...

సింగరేణి ఉజ్వల భవిష్యత్తుకు యాజమాన్యం భూగర్భ, ఓపెన్ కాస్టు పరిశ్రమల పైనే కాకుండా ఇతర రంగాల వైపు కూడా చూస్తోంది. ప్రత్యామ్నాయ పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇందులో భాగంగానే అనుత్పాదక రంగాలను అక్కున చేర్చుకుంటుంది. సింగరేణి నాలుగు కాలాల పాటు ప్రగతి పథంలో విరాజిల్లేందుకు ముందుచూపుతో సింగరేణి యాజమాన్యం పయని స్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బొగ్గు గనులు, ఓసీ ప్రాజెక్టులపైనే ఆధారపడిన సింగరేణి యాజమాన్యం ప్రగతి కాముక ప్రణాళికలతో కొత్తగా సోలార్ ప్రాజెక్టులకు తెరతీస్తోంది. ప్రధానంగా సింగరేణిలో సోలా ర్ విద్యుత్తు ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తుంది.

సింగరేణిలోని రామగుండం, చెన్నూరు, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలో సోలా ర్ పవర్ ప్రాజెక్టులకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. సోలార్ ప్రాజెక్టుల కోసం సింగరేణి యాజమాన్యం కోట్లాది నిధులు వెచ్చి స్తుంది.  వందలాది ఎకరాల స్థలం సోలార్ ప్రాజెక్టుల కోసం కేటాయించింది.

బెల్లంపల్లి, మందమర్రి కేంద్రంగా...

బెల్లంపల్లి రీజియన్ లో సోలార్ పవర్ ప్లాంట్లు పురుడు పోసుకోనున్నాయి. మందమర్రి ఏరియాలో సింగరేణి యజమాన్యం 67.5 మెగా వాట్ల (ఎండబ్ల్యూ) సామర్థ్యంతో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టును చేపడుతుంది. నాలుగు ప్రాంతాల్లో నూతనంగా చేపట్టే ఈ సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఎంతో పురోగతిలో ఉన్నాయి.

మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో నాలుగు చోట్ల నూతనంగా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణo జరుగుతుంది. మందమర్రి కేకే-5 వద్ద 12.5 మెగావాట్లు, ప్రాణహిత కాలనీ వద్ద 12.5 మెగావాట్లు, శాంతిఖని వద్ద 17.5 మెగావాట్లు, బెల్లంపల్లి పాత మ్యాగజిన్ వద్ద 25 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం యాజమాన్యం సుమారు రూ. 400 కోట్లు మంజూరు చేసింది.

సింగరేణి ప్రగతి కోసం యాజమాన్యం సరికొత్తమైన అభివృద్ధికర పథకాలకు వెనుకాడటం లేదు. సింగరేణి యాజమాన్యం సొంతంగా పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకొని వినియోగదారు లకు విద్యుత్ అవసరాలను తీర్చే స్థాయికి ఎదగనుంది. ఓ వైపు బొగ్గు వనరులతో లాభాలను తీసుకొస్తూనే, మరోవైపు ప్రత్యామ్నాయ విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పడం తో  బహుళ రంగాల్లో సింగరేణి ప్రగతికి బాటలు పడనున్నాయి. 

మొదలైన సోలార్ ప్రాజెక్టు పనులు

మందమర్రి, బెల్లంపల్లిలో సోలార్ పవర్ ప్రాజెక్టులను బొండాడ ఇంజనీరింగ్ కంపెనీ టెండర్ తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్సార్ పవర్ సిస్టం సంస్థ సబ్ లీజ్ కు తీసుకునీ పనులు చేపట్టింది. ఇప్పటికే నిర్దేశించిన ప్రాజెక్టు స్థలాలకు సోలార్ ప్యానల్స్, ఇతర సామాగ్రి అందుబాటులోకి చేరాయి. ప్రాజెక్టు నిర్వాహ ణకు సంబంధించిన యంత్రాలు, పరికరాలు ఒక్కటొక్కటిగా గమ్యం చేరుకున్నాయి.

ఈ సోలార్ పవర్ ప్లాంట్ల వల్ల సింగరేణిలో జీవనోపాధికి నూతన అవకాశాలు అందు బాటులోకి రానున్నాయి. ఇలా బొగ్గు ఉత్పత్తితో పాటు, పవర్ ఉత్పత్తి రంగాల్లోకి సింగరేణి అడుగులు వేసింది. సింగరేణిలో నూతనంగా చేపట్టిన సంస్కరణలు సింగరేణి పరిశ్రమ మనుగడ మరింతగా బలపడనున్నది. బహుళ రంగాల సమ్మేళనం సింగరేణి సంస్థను ప్రగతి పథంలో తీసుకువెళ్లనుంది.

సింగరేణి అనూహ్యమైన రీతిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లతో విరాజిల్లనున్నది. సోలార్ పరిశ్రమలతో సింగరేణి కంపెనీ భవిష్యత్తుకి కొండంత భరోసా తథ్యం. ఈ దిశగా సింగరేణి కంపెనీ చేపడుతున్న బహుళ ప్రాజెక్టులు బెల్లంపల్లి ప్రాంత వాసులు, కార్మికుల పిల్లలకు కొత్త జీవితాలను ప్రసాదించాలని ఆశిద్దాం.