- బోర్డు తిప్పేసిన జాగృతి కన్సల్టెన్సీ సంస్థ
1200 మంది నుంచి రూ.24 కోట్లు వసూలు
పరారీలో కంపెనీ డైరెక్టర్ జగదీశ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నేటి యువత కల. లక్షల్లో జీతాలు, వీకెండ్ పార్టీలు, కుటుంబంలో గౌరవం.. ఇంకేముంది ఎలాగైనా జాబ్ కొట్టాలని ఎంతోమంది ఇంజినీరింగ్ డిగ్రీలు పట్టుకొని నగరానికి వస్తుంటారు. కొందరు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సాధిస్తుంటే.. మరికొందరు బ్యాక్ డోర్‌ను ఎంచుకుంటున్నారు. ఇక ఈ రంగంపై యువతకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యో గులను నిలువునా ముంచేస్తున్నాయి.
కంపెనీల నిర్వాహకులు కోట్లలో డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. తాజాగా నగరంలో మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. వివరాలిలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్‌లో జాగృతి కన్సల్టెన్సీ పేరుతో ఓ ఐటీ కంపెనీ ఏర్పాటు చేశారు. కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది నమ్మిన చాలా మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూల కోసం కంపెనీకి వచ్చారు. ఇక్కడే జాగృతి కన్సల్టెన్సీ తన మోసాన్ని అమలు చేసింది. ఉద్యోగం కావాలంటే రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టింది. లక్షల్లో జీతాలు ఇస్తామని వాళ్లు చెప్పిన మాటలు నమ్మి సుమారు 1200 మంది నిరుద్యోగులు ఒక్కొక్కరు రూ. 2 లక్షల చొప్పున చెల్లించారు. డబ్బులు ఇచ్చిన వారికి కంపెనీ ఆఫర్ లెటర్స్ ఇచ్చింది.
కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఉద్యోగం కల్పించారు. కానీ జీతాలు మాత్రం చెల్లించలేదు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు అనుమానం వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఇక ఉద్యోగులు ప్రశ్నించడం, పరిస్థితులు చేయిదాటి పోవడంతో శుక్రవారం రాత్రికి రాత్రే కంపెనీ నిర్వాహకులు కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. మొత్తం 1200 మంది నుంచి రూ.24 కోట్లను జాగృతి కన్సల్టెన్సీ డైరెక్టర్ జగదీశ్ వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. కంపెనీ బోర్డు తిప్పేసిందని ఉద్యోగులు శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.