హాలోవీన్ వేడుకలే లక్ష్యంగా కాల్పులు ఇద్దరి మృతి
ఫ్లోరిడా(ఆర్లాండో), నవంబర్ 1: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ సారి హాలోవీన్ వేడుకలు లక్ష్యంగా మారాయి. ప్రతి సంవత్సరం చలికాలంలో దేశంలో ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఆర్లాండ్ పట్టణంలో అర్ధరాత్రి వరకు జరిగిన హాలోవీన్ వేడుకలకు వేలమంది హాజరయ్యారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ యువకుడు(17) కాల్పులు జరపడంతో ఇద్ద రు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులకు భయపడి అక్కడున్న వారంతా పరుగులు తీశారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆర్లాండో పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్ తెలిపారు. కాగా అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.