ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికలకు ముందు మరో షాక్ తగిలింది. లిక్కర్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ప్రాసికూట్ చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్(ఈడీ)కి ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగనున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం అటు కేజ్రీవాల్‌కు, ఇటు ఆప్‌కు కూడా పెద్ద షాకేనని చెప్పాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సృష్టించాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోవడమే కాకుండా మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించారు.
అనధికారికంగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఈ తరుణంలో ఆయనపై ఈడీ విచారణకు ఎల్జీ అనుమతి ఇవ్వడం ఆప్ విజయావకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మనీ ల్యాండరింగ్‌తో ముడిపడిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈ నెల 5న ఈడీ ఎల్జీని అనుమతులు కోరింది. సీఆర్‌పీసీ ప్రకారం ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.
అయితే ఈడీ కేసుల్లో మాత్రం ఈ అనుమతి గతంలో అవసరం లేదు. తాజాగా గత నెల 6న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈడీ కేసుల్లో కూడా పబ్లిక్ సర్వెంట్లను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి అవసరమైంది. దీంతో ఈడీ కేజ్రీవాల్ విచారణకు ఎల్జీ అనుమతిని కోరింది. మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేజ్రీవాల్‌పై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. అయితే విచారణమాత్రం ప్రారంభం కాలేదు.
ఇప్పుడు ఎల్జీ అనుమతి ఇవ్వడంతో ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణ మొదలు కావడానికి మార్గం సుగమం అయింది.ఈ కేసులో ఈడీ గత మార్చి 21న అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. దాదాపు ఆరు నెలలు జైల్లో ఉన్న తర్వాత సెప్టెంబర్‌లో బెయిలు లభించడంతో బైటికి వచ్చారు.ప్రజలు తనను తిరిగి ఎన్నుకున్న తర్వాతే సీఎం పదవి చేపడతానని జైలునుంచి బైటికి వచ్చాక స్పష్టం చేసిన ఆయన తన స్థానంలో ముఖ్యమంత్రిగా ఆతిశీని నియమించి తాను పూర్తిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు.
లిక్కర్ కుంభకోణం దాదాపు మూడేళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంది. ‘ సౌత్ లాబీ’కి ప్రయోజనం చేకూర్చడానికి 202122 మద్యం విధానంలో కేజ్రీవాల్, అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియా మార్పులు చేశారని, దానికి బదులుగా ఆప్‌కు రూ.100 కోట్ల ముడుపులు ముట్టాయనేది ఈడీ ప్రధాన ఆరోపణ.
కేజ్రీవాల్‌కన్నా ముందే అరెస్టయిన సిసోడియా దాదాపు 18 నెలలు జైల్లో ఉన్న తర్వాత గత ఆగస్టులో బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటుగా మరికొందరు కూడా విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్‌కు ఎల్జీ అనుమతి ఇవ్వడంతో ఎన్నికలకు ముందే ఆయనపై విచారణ మొదలవుతుందా అనేది ఆసక్త్తిగా మారింది. అయితే ఇతర అంశాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఒక వేళ ఎల్జీ అనుమతి ఇచ్చిఉంటే ఈడీ ఆ లేఖను బహిరంగ పర్చాలని ముఖ్యమంత్రి ఆతిశీతో పాటుగా మనీశ్ సిసోడియా తదితర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కుంభకోణంలో కీలక వ్యక్తి కేజ్రీవాలేనని దీనితో తేలిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.