- పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నిర్వహణ
- అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే మహళా స్వయం సహాయక బృందాల(సెల్ఫ్ హెల్ప్)కు స్కూల్, అంగన్‌వాడీ యూనిఫామ్ కుట్టించే బాధ్యత, మహిళా శక్తి కింద ఇందిరమ్మ క్యాంటీన్లు, గ్రామాల్లో మీసేవా కేంద్రాల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించిన సర్కార్.. త్వరలో వారికి మరో శుభవార్తను అందించనుంది. మహిళా శక్తి పథకం కింద స్వయంగా.. పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తలు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.
వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళా సమాఖ్య, స్త్రీ నిధి, ద్వారా రుణం అదజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలవారీగా మహిళా సంఘాల్లో ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం సోమవారం కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే మహిళలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల్లో భాగం చేయగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మహాలక్ష్మిపథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామని పలువురు మంత్రులు సష్టం చేశారు.