- 29న 33 జిల్లాల్లో దీక్షా దీవస్
- కేసీఆర్ పాల్గొనడం లేదు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ప్రజలను రక్షించేందుకు మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈనెల 29న 33 జిల్లాల్లో దీక్షా దీవస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, కాలేరు వెంకటేశ్, వివేకానందలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదీవస్‌ను నిర్వహిస్తామని తెలిపారు. దీక్షా దీవస్‌లో కేసీఆర్ పాల్గొనడం లేదన్నారు. ఈనెల 26న అన్ని జిల్లాల సన్నా హక సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించామని తెలిపారు. డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెడుతున్న నిర్బంధాలను ఎదుర్కొనేందుకు మరోసారి ఉద్యమించాలని సూచించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినందుకు అందరూ బాధపడుతున్నారని పేర్కొన్నారు.
రేవంత్ నాలుక ఏదైనా మాట్లాడుతుంది..
సీఎం రేవంత్ రెడ్డి నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వం విడు దల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కొడంగల్‌లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసమని స్పష్టంగా వెల్లడించిందన్నారు. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ ఎగతాళి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా అని ప్రశ్నించారు. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవరిని పిచ్చోళ్లను చేస్తున్నావంటూ నిలదీశారు. చెప్పేటోడికి వినేవాడు లోకువ అన్న ట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఓడిపోయిన అభ్యర్థితో చెక్కుల పంపిణీయా..
హుజురాబాద్‌లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థితో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం చట్టవిరుద్ధమని కేటీఆర్ అన్నారు. పోలీసు బందోబస్తు పెట్టి మరీ పంపిణీ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉండగా ఓడిపోయిన కాంగ్రె స్ అభ్యర్థి వొడితెల ప్రణవ్‌తో చెక్కుల పంపిణీ సిగ్గుచేటని విమర్శించారు.
మినీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
మినీ అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. జీతాలు పెరిగినా ఇప్పటికీ పాత వేతనాలే అందిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. మినీ అంగన్‌వాడీ సంఘం నేతలు మాట్లాడుతూ ప్రధాన అంగన్వాడీ టీచర్లతో పోలిస్తే మినీ అంగన్వాడీ టీచర్లు ఎక్కువ పనులు చేయాల్సి వస్తోందన్నారు.