12-02-2025 01:21:11 AM
* సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ సూచీలు భారీ నష్టాలు ఎదుర్కొన్నాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అంత ర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్‌సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 77,384.98 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,311.80) స్వల్ప లాభా ల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి వెళ్లిం ది. ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ట్రేడయిన సెన్సెక్స్.. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది.
ఇంట్రాడేలో 76,030.59 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1018.20 పాయింట్ల నష్టం తో 76,293.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,986.65 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి విలువ 60 పైసలు మేర బలపడి 86.85 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎయిర్‌టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరై రూ.408 లక్షల కోట్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2932 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
కారణాలు ఇవే..
స్టీల్, అల్యూమినియంపై టారిఫ్ విధించడంతో పాటు రానున్న రెండ్రోజుల్లో తమపై సుంకాలు వేస్తున్న వారిపై ప్రతీకార సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు వాణిజ్య భయాలను పెంచుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి 10న కూడా రూ.2,463 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయంగా రూపాయి మరింత బలహీన పడుతుండడం కూడా విదేశీ మదుపర్ల అమ్మకాలకు ప్రధాన కారణంగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. క్యూ3 ఫలితాలు సైతం మెప్పించకపోవడం ఇంకో కారణమని విశ్లేషి స్తున్నారు.