calender_icon.png 26 October, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రూ. 6.80 లక్షల కోట్ల సంపద ఆవిరి

26-10-2024 12:00:00 AM

బేర్స్ దెబ్బకు బుల్స్ కకావికలు 

  1. రెండున్నర నెలల కనిష్ఠస్థాయికి సూచీలు
  2. 80,000 పాయింట్ల స్థాయిని వదులుకున్న సెన్సెక్స్
  3. 24,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ

ముంబై, అక్టోబర్ 25: ఈ వారాంతంలో స్టాక్ మార్కెట్లో మరోదఫా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి.  పలు క్యూ2 కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చ డంతో  చిన్న, పెద్ద షేర్లు అని చూడకుండా స్టాక్స్‌కు వదిలించుకుని బుల్స్ పరుగులు తీసారు.

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మొదలైన అమ్మకాలు మధ్యాహ్న సెషన్‌లో తీవ్ర తరమయ్యాయి. దాంతో స్టాక్ సూచీలు రెండున్నర నెలల కనిష్ఠానికి పతనమయ్యాయి. మరో రూ. 6.80 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద చూస్తుండగానే ఆవిరైపోయింది. బుధవారం ఇన్వెస్టర్లు రూ. 9.20 లక్షల కోట్ల సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే.

బీఎస్‌ఈ సెన్సెక్స్  ఇంట్రాడేలో 900 పాయింట్ల కుపైగా పతనమమై 80,000 పాయింట్ల స్థాయిని వదులుకుని 79,137 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 663 పాయింట్ల నష్టంతో  79,402 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 320 పాయింట్లకుపైగా క్షీణించి 24,100 పాయింట్ల దిగువకు పడిపోయింది.

చివరకు కీలక సాంకేతిక మద్దతుస్థాయి 24,200 పాయింట్ల దిగువన  218 పాయింట్ల నష్టంతో 24, 180 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  అంతర్జాతీయ సంకేతాల బలహీనత, యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ ఫంద్స్ భారత్ నుంచి పెట్టుబడుల్ని చైనాకు మళ్లించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని  విశ్లేషకులు చెప్పారు.

తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ.6,80,483 కోట్లు క్షీణించి రూ. 4,36,98,921 కోట్లకు (5.20 ట్రిలియన్ డాలర్లు) పడిపోయింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,822 పాయింట్లు, నిఫ్టీ 673 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ఈ వారంలో వరుసగా ఐదు ట్రేడింగ్ రోజుల్లోనూ మార్కెట్ నష్టాలతోనే ముగిసింది. 

పతనానికి పలు కారణాలు

తాజా మార్కెట్ పతనానికి పలు కారణాలున్నాయని, భారత్ మార్కెట్ అధిక విలువల పట్ల ఆందోళనతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడం ప్రధాన కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. తాజాగా యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వేగంగా పెరగడంతో ఫెడ్ రేట్ల కోతల పట్ల మార్కెట్లో అంచనాలు తగ్గాయని, ఈ ప్రభావంతో భారత్ తదితర వర్థమాన మార్కెట్ల నుంచి నిధులు తరలివెళుతున్నాయని చెప్పారు.

భారత కార్పొరేట్లు..ప్రత్యేకించి వినియోగ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపర్చాయని, పట్టణ వినియోగం తగ్గుతున్నట్లు ఆ ఫలితాలు సూచిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ మంద గిస్తున్నదనడానికి ఇది తొలి సంకేతమని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు.

విదేశీ ఫండ్స్ అమ్మకాలకు తోడు తాజాగా వెల్లడైన క్యూ2 ఫలితాలతో మార్కెట్ అతలాకుతలమయ్యిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. మరోవైపు ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్ వరుస పతనానికి కారణమైనట్లు విశ్లేషకులు తెలిపారు. 

రూ.లక్ష కోట్లకు చేరువలో ఎఫ్‌పీఐల అమ్మకాలు

ఈ ఒక్క నెలలో భారత ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) తరలించిన నిధులు రూ. 1 లక్ష కోట్లను సమీపిస్తున్నాయి. ఎఫ్‌పీఐ విక్రయాలు శుక్రవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.3,036 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితో ఈ నెలలో ఇప్పటివరకూ భారత్ నుంచి వెనక్కు తీసుకున్న ఈక్విటీ నిధులు  రూ.98,000 కోట్లను మించాయి. 

ఇండస్‌ఇండ్ బ్యాంక్ 18 శాతం పతనం

సెన్సెక్స్-30 ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ 18 శాతం పతనమయ్యింది. ఈ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో 40 శాతం లాభాల క్షీణతను వెల్లడించింది. వరుస పతనాల్ని చవిచూస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా మరో 3.37 శాతం పడిపోయింది.  ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్,  లార్సన్ అండ్ టుబ్రో, టాటా స్టీల్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, టైటాన్‌లు 3 శాతం వరకూ తగ్గాయి.

మరోవైపు ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, సన్‌ఫార్మా,  ఐసీఐసీఐ బ్యాంక్‌లు  2 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 3.09 శాతం పడిపోయింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.74 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.69 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 2.66 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 2.53 శాతం, టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 2.38 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.23 శాతం చొప్పున క్షీణించాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ మాత్రం లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.44 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.46 శాతం చొప్పున నష్టపోయాయి.