calender_icon.png 18 November, 2024 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీకి మరో అరుదైన గౌరవం

18-11-2024 01:50:49 AM

అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసిన నైజీరియా

ఈ ఘనత సాధించిన రెండో విదేశీయుడిగా మోదీ రికార్డు

నైజీరియాతో సంబంధాలకు ప్రాధాన్యమిస్తాం: మోదీ

నైజీరియా, నవంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఖాతాలో మరో అత్యున్నత విదేశీ పురస్కారం చేరింది. మోదీకి నైజీరియా అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (జికాన్)ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నైజీరియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబు అందజేశారు. ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీయుడిగా మోదీ రికార్డు సృష్టించారు.

అంతకుముందు బ్రిటన్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ మాత్రమే జికాన్‌ను అందుకున్నారు. దీంతో మోదీకి విదేశాల నుంచి వచ్చిన పురస్కారాల సంఖ్య 17కు చేరుకుంది. జీ20 సమావేశాల కోసం బ్రెజిల్ వెళ్లేముందు టినుబు ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ దేశ రాజధానిఅబుజాకు మోదీ చేరుకున్నారు. అక్కడ భారత ప్రధానికి ఘనస్వాగతం లభించింది. 17 ఏళ్ల తర్వాత నైజీరియాలో భారత ప్రధాని పర్యటించడం గమనార్హం.  

కొత్త అధ్యాయానికి నాంది

నైజీరియా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు బొలాతో మోదీ భేటీ అయ్యారు. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని మోదీ తెలిపారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు భారత్ కృషి చేస్తుందని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, డ్రగ్స్ వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, నైజీరియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి.

ప్రస్తుత చర్చల తర్వాత భారత్ నైజీరియా సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నా. నైజీరియాలోని 60 వేల మంది భారతీయులు రెండు దేశాల మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వారి సంక్షేమానికి భరోసా ఇచ్చినందుకు బొలాకు ధన్యవాదాలు అని తెలిపారు.