- వింబుల్డన్ ఫైనల్ చేరిన జాస్మిన్
- సెమీస్‌లో వెకిక్‌పై ఘనవిజయం
మొన్నమొన్నటి వరకు మొదటి రౌండ్ దాటడమే కష్టం అనుకున్న ఇటలీ చిన్నది.. వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరింది. రెండు నెలల వ్యవధిలో అనూహ్య ఆటతో దూసుకెళ్తున్న జాస్మిన్ పవోలిని వింబుల్డన్ తుదిపోరుకు అర్హత సాధించింది. దాదాపు మూడుగంటల పాటు సాగిన సెమీస్‌లో అన్‌సీడెడ్ వెకిక్‌పై అద్వితీయ పోరాటంతో జాస్మిన్ విజయం సాధించింది. నేడు పురుషుల సెమీఫైనల్లో మెద్వెదెవ్‌తో అల్కరాజ్, మెసెట్టీతో జొకోవిచ్ తలపడనున్నారు.
లండన్: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఇటలీ ప్లేయర్ జాస్మిన్ పవోలిని ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏడోసీడ్ జాస్మిన్ 2-6, 6-4, 7-6 (10/8)తో అన్‌సీడెడ్ డోనా వెకిక్ (క్రొయేషియా)పై గెలుపొందింది. గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన 28 ఏళ్ల జాస్మిన్‌కు ఇది వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ తుదిపోరు కావడం విశేషం. 2016 (సెరెనా విలియమ్స్) తర్వాత మహిళల సింగిల్స్‌లో ఒక ప్లేయర్ వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరడం ఇదే తొలిసారి.
దాదాపు మూడు గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి సెట్ కోల్పోయిన జాస్మిన్.. ఆ తర్వాత రెండో సెట్ ఆరంభంలోనూ వెనుకబడి కూడా పుంజుకుంది. మ్యాచ్ మొత్తంలో 5 ఏస్‌లు కొట్టిన పవోలిని.. సర్వీస్ ద్వారానే అత్యధిక పాయింట్లు పట్టింది. మరోవైపు ఏస్‌లు (7), విన్నర్ల (42)లో జాస్మిన్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిన వెకిక్.. 57 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం జాస్మిన్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు అద్భుతంగా సాగాయని చెప్పింది.
నేడు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్
ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ నేడు సెమీఫైనల్ బరిలో దిగనున్నాడు. సెంటర్ కోర్ట్‌లో జరగనున్న పోరులో ప్రపంచ 25వ ర్యాంకర్ ముసెట్టి (ఇటలీ)తో రెండో సీడ్ జొకోవిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో సెమీస్‌లో ఐదోసీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) తలపడనున్నాడు. ఫెదరర్, నాదల్ వంటి దిగ్గజాల గైర్హజరీలో.. గ్రాండ్‌స్లామ్స్‌లో నిలకడ కొనసాగిస్తున్న అల్కరాజ్.. నాలుగో టైటిల్ సాధించాలని తహతహలాడుతున్నాడు.