24-04-2025 09:05:28 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గువ్వా ప్రేమేష్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. కొత్తగూడ మండలం దుర్గారం గ్రామానికి చెందిన జంగా సంపత్, ఎల్లయ్య అన్నదమ్ముల కుమార్తెలు జంగా మౌనిక, జంగా నవ్యతో పాటు సమీప బంధువులైన గువ్వ రమేష్, జాల కార్తీక్ తో కలిసి ఇదే మండలం పొగుళ్లపల్లిలోని మేనత్త వివాహ వేడుకలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.
ఈ క్రమంలో కొత్తపల్లి-పెగడపల్లి గ్రామాల మధ్య వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ను ట్రాలీ ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్క, చెల్లెలు మౌనిక, నవ్య ఘటనస్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమేష్, కార్తీక్ ను తొలిత నర్సంపేట ఆసుపత్రికి ఆ తరువాత వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రేమేష్ చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. మృతులు ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.