calender_icon.png 7 November, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్ ప్రకటనకు మరో అడ్డంకి?

31-08-2024 12:48:05 AM

  1. ఎస్టీల నుంచి రేసులో బలరామ్ నాయక్ 
  2. హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికలతో ఆలస్యం 
  3. పదవి కోసం బీసీల మధ్య తీవ్ర పోటీ 
  4. మధ్యే మార్గంగా తెరపైకి మరోపేరు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపికకు మరో అడ్డంకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పుడె ప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు నిరాశ తప్పేలా లేదు. పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రేపో, మాపో ఉంటుందని పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల నుంచి లీక్‌ల మీద లీక్‌లు వచ్చాయి. అయితే హర్యానా, జమ్ముకశ్మీర్ అసెం బ్లీ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలు బిజీగా ఉండటంతో మరికొన్ని రోజు లు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు జరిగే రెండు రాష్ట్రాలను కాంగ్రెస్ హైకమాండ్ కీలకంగా భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుం టోంది. దీతో టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన విషయంలో మరింత ఆలస్యం కానున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డినే కొనసాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాలన వైపు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల.. పార్టీ కార్యక్రమాల విషయంలో కొంత స్థబ్దత నెలకొన్నదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  పీసీసీ చీఫ్‌ను త్వరగా ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు రేవంత్‌రెడ్డి సూచించారు. 

నాయకుల మధ్య పోటీ..

  ఇదిలా ఉండగా, పీసీసీ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం మొదటగా నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ పదవి కోసం బీసీల నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే బీసీల నుంచి వినిపిస్తున్న వారిలో గౌడ  సామాజిక వర్గానికి చెందిన నాయకుల మధ్యనే పోటీ నెలకొన్నది. కొందరు మహేశ్ కుమార్ గౌడ్ పేరును సూచిస్తుండగా, మరి కొందరు మధుయాష్కీగౌడ్ పేరును సూచించారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ ఎంపికలో  మహేశ్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు ఎక్కువగా ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో రాహుల్‌గాంధీకి దగ్గరగా ఉన్న మధుయాష్కీగౌడ్ అప్రమత్తమై ఢిల్లీలోనే తిష్ట వేసి.. పీసీసీ పదవీ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు కూడా ఎటు తేల్చలేకపోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో  ప్రచారం జరుగుతోంది. 

  మధ్యే మార్గంగా..            

పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ మధ్య పోటీ నెలకొనడంతో.. మధ్యేమార్గంగా పార్టీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పీసీసీ పదవిని ఇప్పటివరకు ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వలేదని ఆ వర్గం నేతలు అధిష్టానం వద్ద బలంగా  చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచారని, అందుకు పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిందని చెబుతున్నారు.

ఈసారి పీసీసీ చీఫ్ పదవిని ఎస్టీలోని లంబాడ సామాజిక వర్గానికి ఇవ్వాలని బలరామ్ నాయక్‌లాంటి నేతలు ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. అందుకు రాష్ట్రంలోని ముఖ్య నేతల పాత్ర కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు బీసీలు పదవీ కోసం కొట్లాడుకుంటే.. పీసీసీ పదవీ చేజారే ప్రమాదం ఉందని బీసీ వర్గానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు అభిప్రాయపడ్డారు.