01-03-2025 12:00:00 AM
ఖననం చేయడానికి స్థలం లేకపోవడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద
మృతదేహంతో నిరసన వ్యక్తం చేసిన పునరావాసులు
గజ్వేల్, ఫిబ్రవరి 28: గజ్వేల్ పరిధిలోని మల్లన్నసాగర్ పునరావాస కాలనీ గ్రామాల్లో ఖననం చేయడానికి ఖబ్రస్తాన్ లేకపోవడంతో శుక్రవారం ఎర్రవల్లి గ్రామస్తులు మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ పునరావాస గ్రామమైన ఎర్రవల్లికి చెందిన నాజియా (28) అనారోగ్యంతో వైద్యం పొందుతూ గురువారం మృతి చెందింది.
భర్త రబ్బాని, బంధువులు, గ్రామస్తులు పునరావాస కాలనీలో ఖననం చేయడానికి ఖబ్రస్తాన్ లేకపోవడంతో గజ్వేల్ లోని ఖబ్రస్తాన్లో ఖననం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు గజ్వేల్ ముస్లిం మత పెద్దలు ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేక ఆర్డిఓ కార్యాలయం వద్ద మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు.
సీఐ సైదా విషయం తెలుసుకొని ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఎర్రవల్లి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను గ్రామస్తులు వివరించడంతో గజ్వేల్ మజీద్ కమిటీ అధ్యక్షుడు మతిన్ తో మాట్లాడి గజ్వేల్ లోనే మృతదేహాన్ని ఖననం చేయడానికి ఒప్పించారు. దీంతో గ్రామస్తులు శాంతించి అంత్యక్రియలు నిర్వహించారు.