calender_icon.png 4 April, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ భూములు కబ్జా చేస్తే మరో ఉద్యమం

02-04-2025 12:35:18 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హెచ్చరిక 

చేర్యాల, ఏప్రిల్ 1:ఆలయ భూములు కాజేయాలని చూస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో మరో ఉద్యమం చేయడానికి కూడా వెనకాడబోమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న ఆలయ భూములను అధికార పార్టీ మండల నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

కబ్జాదారులు నుండి ఆలయ భూములు కాపాడడానికి ఎన్ని ఉద్యమాలైనా చేస్తామన్నారు. అందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రయోజనాల వాజ్యం వేశామన్నారు. 1983 లోనే ఆలయానికి భూమి అమ్మినట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, మరలా ఆ భూమి తనదేనని అధికార పార్టీ నాయకుడు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

కోర్టులో ఉన్న ఈ భూ వివాదంలో గట్టిగా వాదనలు వినిపించకుండా ఈఓ ను కోర్టుకు వెళ్లకుండా ప్రభావితం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆలయం ఆధీనంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతుందని, ఇప్పుడు ప్రయత్నించం ఏమిటి అని వారు ప్రశ్నించారు.  ఆ భూమిని గత పది సంవత్సరాల నుంచి వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగించడం జరుగుతుందన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే ఆలయ ప్రాంగణ భూములు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రానున్న రోజులలో ఇదే విధంగా కొనసాగితే భక్తుల రద్దీ పెరిగే వాహనాల పార్కింగ్ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులకు సరైన పార్కింగ్ స్థలం లేక ప్రైవేట్ స్థలాలలో అద్దె చెల్లించి పార్కింగ్ చేస్తున్నారన్నారు.

ఆలయ భూములు రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భక్తులు, ప్రజలు ముందుకొచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆలయ భూములు రక్షించడానికి రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భక్తులు ఐక్యంగా పోరాడి భూములను కాపాడాలని సూచించారు.  ఈ సమావేశంలో మండల కార్యదర్శి తాడూరి రవీందర్, నాయకులు బద్దిపడిగా కృష్ణారెడ్డి, తేలు ఇస్తారి, బక్కిలి బాలకిషన్, తాడూరి భరత్ కుమార్ ఉన్నారు.