- ప్రజలను జాగృతం చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ‘దీక్షా దివస్’లో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు, ఢిల్లీ కీలుబొమ్మలు దాడి చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో మౌనవ్రతం చేస్తున్నారని, ప్రజాసమస్యలపై గళమెత్తే ఎంపీనే లేకపోయాడని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై గళమెత్తే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
లగచర్లలో భూసేకరణ విరమణ కేవలం బీఆర్‌ఎస్‌తో పాటు ప్రజల విజయమని కొనియా డారు. 1968- 71 వరకు తెలంగాణ ఉద్యమంలో 370 మందిని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో ఉందని, అందుకే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్ ప్రజలకు ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ అయిందని, ప్రజలకు ఏ కష్టమొచ్చినా కార్యాలయానికి తరలివస్తున్నారని అన్నారు. ఒకప్పుడు సమైక్యాంధ్రకు సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి, తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టారని విరుచుకుపడ్డారు.
పదవులను త్యాగం చేసి నాడు కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించారని, స్వరాష్ట్రం కోసం ప్రాణ తాగ్యానికి సైతం సిద్ధపడిన మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయన పూనుకోకపోతే తెలంగాణ ఎప్పటికీ వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ పోరాటయోధులు చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమల ఏనాడూ ఉద్యమంలో వెనకడుగు వేయలేదన్నారు.
షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య త్యాగాలను మరవొద్దన్నారు. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, కేంద్రం ఎస్సార్సీ కమిషన్‌కు సిఫారుసులకు వ్యతిరేకంగా 1956లో బలవంతంగా ఆంధ్రప్రదే శ్‌లో కలిపారన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ఆరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు.
ఆయన దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తుచేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని, కాంగ్రెస్ పాలకులు వచ్చి పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టే కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలకు గూడు లేకుండా చేస్తుందని మండిపడ్డారు. రైతులకు రైతుభరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇవ్వడమెందుకు? తర్వాత వాటిని ఎగవేయడం ఎందుకని నిలదీశారు. తొలుత వేలసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బసవతారకం ఆసుపత్రి నుంచి తెలం గాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
వేడుకల్లో ఎమ్మెల్సీ మధుసూదనచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, పద్మారావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పార్టీ నాయకులు మాగంటి గోపినాథ్, , తలసాని సాయికుమార్, రాఘవ యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కిశోర్‌గౌడ్ పాల్గొన్నారు.