calender_icon.png 12 January, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మసీదు వివాదం

15-09-2024 12:00:00 AM

మనదేశంలో ప్రార్థనా స్థలాలు వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఓ మసీదు వ్యవహారం గత కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని అట్టుడికేలా చేస్తోంది. సంజోలి ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఓ మసీదును కూల్చివేయాలంటూ గత బుధవారం ‘దేవ భూమి సంఘటన్’ పేరుతో పలు హిందూ సంఘాలకు చెందిన వేలాది మంది నిరసన ప్రదర్శన నిర్వహించడంతో ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రదర్శనకారులపై లాఠీచార్జితో పాటు వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించారు.

దీంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయి ప్రభుత్వ భూమిలో నిర్మించిన మసీదును కూల్చివేయాల్సిందేనంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనధికారిక మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారంటున్నారు. అది ప్రార్థనామందిరమా కాదా అనేది ప్రశ్న కాదని కట్టడం చట్టబద్ధతనే తాము ప్రశ్నిస్తున్నామని అంటున్నారు. ఈ వివాదం ఇప్పటిది కాదు. 2010లో తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది. 1960లో మసీ దు రెండతస్థుల్లో ఉండగా ఆ తర్వాత అయిదంతస్థులకు దీన్ని విస్తరించారు.

దీనిపై పలు నోటీసులు ఇచ్చినాపట్టించుకోకుండా 6,750 చదరపు అడుగులకు దీన్ని విస్తరించారు. నిర్మాణం జరిగిన చోటు హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమి అని హిందూ సంఘాలు వాదిస్తుండగా మసీదు ఇమామ్ మాత్రం ఇది 1947 క్రితం నాటిదని, వక్ఫ్‌బోర్డుకు చెంది న ఆస్తని చెబుతున్నారు. అక్రమ నిర్మాణంపై 2010నుంచి ఇప్పటివరకు 42 సార్లు కోర్టులో విచారణ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ లోగా మసీదు నిర్మాణం రెండతస్థులనుంచి అయిదంతస్థులకు పెరిగింది. ఆ ప్రాంతంలో ముస్లిం జనాభా వేగంగా పెరగడం కూడా స్థానికుల ఆందోళనకు కారణమయింది.

వాస్తవానికి గొడవ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అక్కడికి దగ్గర్లోని ఓ గ్రామంలో హిందూ వ్యాపారికి, ముస్లిం యువకులకు మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఆందోళనకు బీజం వేసిందని స్థానికులు అంటున్నారు. హిందూవ్యాపారిపై దాడి చేసిన నిందితులు మసీదులో దాక్కోవడమే కారణం. దీనికి రాజకీయాలు కూడా తోడయ్యాయి. నిరసనకారులకు మద్దతుగా బీజేపీ మద్దతుదారులు రంగంలోకి దిగడంతో సమస్య జటిలంగా మారింది. హిమాచల్ అసెంబ్లీ లో సైతం ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

గురువారం పోలీసుల చర్యకు నిరసనగా నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ‘దేవభూమి సంఘటన్’ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. సిమ్లా, కులూ సహా ప్రధాన నగరాల్లో దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. అయితే ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అంటున్నారు. ఇది అక్రమ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం అని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా గురువారం గొడవల అనంతరం వక్ఫ్‌బోర్డు,మసీదు ఇమామ్, కమిటీ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం మున్సిపల్ కమిషనర్ భూపేంద్ర అత్రీని కలిసి ఓ వినతిపత్రం సమర్పించింది. మసీదులో అక్రమనిర్మాణంగా భావిస్తున్న ప్రాంతాన్ని సీల్ చేయాలని, కోర్టు తీర్పు ప్రకారం అక్రమ నిర్మాణ భాగాన్ని తామే కూల్చివేస్తామని వారు కమిషనర్‌కు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని ముస్లిం సమాజం హిమాచల్ ప్రదేశ్‌లో శాశ్వత నివాసులని, దశాబ్దాలుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని ప్రతినిధి బృందం నొక్కి చెప్పింది.

శాంతి, సోదరభావంతో జీవించాలని తాము కోరుకుంటున్నామని కూడా వారు స్పష్టం చేశారు. అయితే బయటి రాష్ట్రాలనుంచి రాష్ట్రానికి వచ్చిన ముస్లింలు ఇక్కడ స్థిరపడిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చే నెల 5న ఈ అంశంపై కోర్టు విచారణ జరగనుంది. అప్పుడైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూడాలి.