calender_icon.png 6 January, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం గూటికి మరో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే?

09-07-2024 02:18:07 AM

  1. నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న పాలమూరు నేతలు 
  2. రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి 
  3. సీఎం పాలమూరు పర్యటనకు ఒక రోజు ముందే భేటీ 
  4. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరిక

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. హస్తం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం బాట పట్టారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

వెంకట్రామిరెడ్డితోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా పార్టీ మారుతారని చెప్తున్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు పర్యటనకు వెళ్లుతున్నారు. అంతకు ముందు రోజు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సీఎంతో హైదరాబాద్‌లో భేటీ కావడం హాట్‌టాపిక్ మారింది. మహబూబ్‌నగర్‌లోనే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి పాలమూరు బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.   

జిల్లా సమస్యలపై సీఎంకు ఎమ్మెల్సీ వినతి 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాయిచూర్ నుంచి శ్రీశైలం రహదారిని 4 లేన్లుగా అభివృద్ది చేయాలని, ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల వారికి కర్నూల్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 

నేడు పాలమూరుకు రేవంత్‌రెడ్డి 

జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు మహబూబ్‌నగర్ ఐడీవోసీ వద్దకు చేరుకుని మొక్కలు నాటుతారు. అనంతరం ఉమ్మడి పాలమూరు ప్రముఖులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తారు.