calender_icon.png 21 January, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో పతకం వేటలో

30-07-2024 01:08:30 AM

  1. కాంస్య పతక పోరుకు మనూ జంట
  2. షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్
  3. రమితా, అర్జున్‌లకు నిరాశ

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లకు సోమవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగాల్లో అర్జున్ బబౌటా, రమితా జిందాల్‌లు ఫైనల్ పోరులో నిరాశపరిచారు. 10 మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన భారత షూటర్ మనూ బాకర్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతక పోరుకు అర్హత సాధించడం ఊరట కలిగించే అంశం. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌గా చరిత్రలో నిలిచేందుకు మనూ అడుగు దూరంలో నిలిచింది. మరి షూటింగ్‌లో మనకు రెండో పతకం వస్తుందా లేదా అన్నది నేడు తేలిపోనుంది.

చటౌరోక్స్ (పారిస్): ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ మనూ బాకర్ సింగ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. నేడు జరగనున్న కాంస్యం పోరులో భారత జోడీ కొరియాకు చెందిన ఓ యె జిన్ లీ వోన్హో  జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక 582 పాయింట్ల ఒలింపిక్ రికార్డు స్కోరుతో టర్కీ.. 581 పాయింట్లతో సెర్బియా తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యాయి.

గేమ్‌లో మనూ జోడీ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు రౌండ్లలో 98, 98 స్కోరు చేసిన మనూ బాకర్ చివరి రౌండ్‌లో 95 స్కోరు చేయగలిగింది. తొలి రౌండ్‌లో 95 స్కోరు చేసిన సరబ్‌జోత్ సింగ్ రెండు, మూడు రౌండ్లలో 97, 97 స్కోరు నమోదు చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో భారత్ నుంచి బరిలోకి దిగిన రిథమ్ సంగ్వాన్‌ేొఅర్జున్ సింగ్‌లు 576 పాయింట్లు స్కోరు చేసి పదో స్థానంతో సరిపెట్టుకున్నారు. 

తృటిలో పతకం మిస్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన అర్జున్ బబౌటా తృటిలో పతకం చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో అర్జున్ 208.4 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఒకదశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ ఆ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయాడు. 13వ షాట్‌లో 9.9 పాయింట్లు మాత్రమే సాధించిన అర్జున్ 18వ షాట్‌లో 10.1 పాయింట్లు స్కోరు చేసి రేసులోకి వచ్చాడు. అయితే చివరి షాట్‌కు 10.5 పాయింట్లు సాధించి ఉంటే కాంస్యం దక్కేదే. కానీ 9.5 పాయింట్లు మాత్రమే స్కోరు చేయడంతో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. చైనా షూటర్ షెంగ్ లిహావో (252.2 పాయింట్లు), స్వీడన్‌కు చెందిన లిండ్‌గ్రెన్ విక్టర్ (251.4 పాయింట్లు), క్రొయేషియా షూటర్ మారిసిక్ మీరాన్ (230 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.

రమితాకు నిరాశే

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ రమితా జిందాల్ నిరాశపరిచింది. టాప్‌న మధ్య జరిగిన ఫైనల్ పోరులో రమితా 145.3 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. హెచ్‌జె బాన్ (దక్షిణకొరియా), వైటీ హుయాంగ్ (చైనా), గొగ్నియత్ (స్విట్జర్లాండ్) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలో ఉన్న షూటర్ పృథ్వీరాజ్ తొండైమన్ తొలి రోజు పోటీల్లో 30వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. 10 మీటర్ల విభాగంలో పిస్టల్, రైఫిల్ ఈవెంట్లు ముగియనుండగా.. 25 మీటర్ల పిస్టల్, రైఫిల్ విభాగంలో పోటీలు మొదలుకానున్నాయి.