- ఫోర్జరీ సంతకాలతో సంస్థ సిబ్బంది మోసం
- తీసుకున్నది ౧౮ లక్షలు.. కట్టాల్సింది ౩౦ లక్షలు
- సూర్యాపేటలో ఇండల్ సంస్థ నమ్మక ద్రోహం
- న్యాయం చేయాలని అధికారులకు బాధితుల మొర
సూర్యాపేట, జూలై 13: అత్యవసరం కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి అప్పు తీసుకున్న వారికి తెలియకుండా అదే లోన్‌పై అప్పు ఇచ్చిన సంస్థ సిబ్బంది మరో లోన్ తీసుకున్న ఘటన సూర్యాపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన బుర్ర శ్రీనివాస్, సరస్వతి దంపతులు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న ఇండల్ మనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.18 లక్షల లోన్ తీసుకున్నారు. ఆ సంస్థ మేనేజర్ రుణ గ్రహీతలకు తెలియకుండా అదే బంగారంపై ఫోర్జరీ సంతకాలతో మరో రూ.౨ లక్షల రుణం అధిక వడ్డీకి తీసుకున్నాడు. ఇటీవల సంస్థ నుంచి లోన్ కట్టనందున బంగారం వేలం వేస్తామని సమాచారం వచ్చింది.
వెంటనే సంస్థలోకి వెళ్లి చూడగా అసలు, వడ్డీ మొత్తం రూ.30 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఖంగుతిన్నారు. దీంతో పూర్తి వివరాలను బయటకు తీయగా సంస్థ మేనేజరే అధిక వడ్డీతో మరో రెండు లక్షలను ఫోర్జరీ సంతకాలతో తీసుకున్నట్టు తేలింది. ఆ కారణంగా కట్టాల్సిన లోన్ భారీగా పెరిగిపోయింది. రూ.18 లక్షలకు కేవలం 15 నెలల్లో తొమ్మిది లక్షల వడ్డీ అయ్యిందని వాపోయారు. ఇదే విషయాన్ని సంస్థ జోనల్ మేనేజర్, ఏరియా మేనేజర్ల దృష్టికి తీసుకవెళ్లగా ఫోర్జరీ సంతకాలు చేసింది వాస్తవమేనని, మేనేజర్‌పై చర్యలు తీసుకుంటామంటున్నారే తప్పా నగదును తిరిగి ఇప్పిస్తామనడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే సదరు మేనేజర్‌ను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సంస్థ నుంచి వెళ్లిపోయాడన్నారు. చేసేదేమీ లేక అధిక వడ్డీకి అంగీకరిస్తూ రూ.7 లక్షలు చెల్లించి లోన్‌ను రెన్యువల్ చేసుకున్నామని, మరో రూ.మూడు లక్షలు కడితేనే బంగారాన్ని వేలం వేయకుండా ఆపుతామంటూ సంస్థకు చెందిన వారు బెదింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీరే కాకుండా సంస్థలో లోన్ తీసుకున్న బాధితులైన సంధ్య, అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఈ సంస్థలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. అధికారులు స్పందించి ఇలాంటి మోస పూరిత సంస్థల నుంచి వినియోగదారులను కాపాడాలని కోరారు.