calender_icon.png 26 October, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమోయ్ మెడకు మరో భూ స్కాం

26-10-2024 01:57:08 AM

  1. ఓ రియల్ కంపెనీతో చేతులు కలిపి రూ. వెయ్యి కోట్ల ప్రాపర్టీకి ఎసరు!
  2. ధరణిలో రికార్డులు మార్చి భూములను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపణ
  3. ఈడీకి ఫిర్యాదు చేసిన తట్టిఅన్నారం బాధితులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, రంగారెడ్డి, అక్టోబర్ 25(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తున్నాయి. జిల్లాలోని మరో భూకుంభకోణం తాజాగా ఆయన మెడకు చుట్టుకుంది.

రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ధరణిలో భూరికార్డులు సవరించినట్లు ఆయనపై శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధికి చెందిన తట్టిఅన్నారం గ్రామానికి చెందిన పలువురు భూ బాధితులు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో భూదాన్ భూముల క్రయవిక్రయాల కేసు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 17లో జరిగిన భూ అవకతవకలపై  ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును కుడా ఈడీ పరిగణనలోకి తీసుకోవాలని బాధితులు ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.

బాధితులు ఏమంటున్నారంటే..

తట్టి అన్నారంలోని సర్వేనంబర్ 108, 109, 110, 111లో 70 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన రికార్డులను మార్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన మద్ది సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తికి చెందిన 70 ఎకరాల భూమిని 1979లో మధురానగర్ కాలనీ అసోసియేషన్ వారు కొనుగోలు చేశారు.

వీరు ఆ భూమిని 840 ప్లాట్లుగా మార్చి సమీపంలో హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉండే వారికి విక్రయించారు. 800కు పైగా బాధితులు ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ప్లాట్ల విస్తీర్ణం దాదాపుగా 2 లక్షల 40 వేల గజాల వరకు ఉంటుందని, మార్కెట్ విలువ రూ.1,000 కోట్లు పలుకుతుందని బాధితులు తెలిపారు.

ఈ ప్రాపర్టీపై కొందరు రియల్ వ్యాపారుల కన్నుపడగా అమోయ్‌కుమార్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ధరణి రికార్డుల్లో మార్పులు చేసి ఇతరుల పేర్ల మీదికి అక్రమంగా మార్చారని, వారికి పట్టాలు వచ్చేలా కలెక్టర్ అమోయ్ చూశాడని వారు ఆరోపిం చారు. ప్రస్తుతం బాధితులమంతా ఆ ప్లాట్ల ను దక్కించుకొనేందుకు కోర్టును ఆశ్రయించామని బాధితులు.. మధురానగర్ కాలనీ అధ్యక్షుడు రాంమ్మోహన్‌గౌడ్, మాల్కజిగిరి కంటెస్టేడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

మూడో రోజు అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ

భూదాన్ భూముల బాగోతంపై ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు వరుసగా మూడో రోజు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5:30 వరకు సాగింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంపైనే అమోయ్‌కుమార్‌ను ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కోట్లు విలువ చేసే 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చవకగా ఇతరులకు కేటాయించడంపై వచ్చిన ఆరోపణల మీదే ఈడీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అమోయ్‌కుమార్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డ్ చేశారు.

కాగా, గతంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే రంగారెడ్డి జిల్లాలోని రైతులను బెదిరించి అక్రమంగా తమ భూములను లాక్కున్నారని ఆ ప్రాంత రైతులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసును ఈడీ అధికారులు టేకప్ చేయగా, అమోయ్‌కుమార్‌ను విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. శనివారం కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.