బతికే ఉన్న లాడెన్ కొడుకు హంజా లాడెన్
కాబూల్, సెప్టెంబర్ 13: అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ బతికే ఉన్నాడు. అతడు ఆఫ్గనిస్థాన్‌లో సురక్షితంగా ఉన్నాడని, మళ్లీ అల్‌ఖైదా ఉగ్రవాదులందరినీ ఏకం చేసి పాశ్చాత్య ప్రపంచంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాడని అంతర్జాతీయ నిఘా సంస్థలను ఉటంకిస్తూ ది మిర్రర్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.
కాబూల్‌లో అల్‌ఖైదా అధినేత జవహరిని అమెరికా అంతమొందించిన తర్వాత సంస్థ హంజా ఆధీనంలోకి వచ్చిందని, తన సోదరుడు అబ్దుల్లాతో కలిసి ఉగ్ర సంస్థను మళ్లీ బలోపేతం చేస్తున్నాడని తాలిబా న్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేషనల్ మొబిలైజేషన్ ఫ్రంట్ కూడా హెచ్చరించింది. లాడెన్ మరణం తర్వాత అల్‌ఖైదాకు జవహరి నాయకుడయ్యాడు. అతడిని పక్కా సమాచారంతో అత్యంత కచ్చితత్వంతో కాబూల్‌లోని అతడి ఇంట్లోనే అమెరికా మట్టుబెట్టింది.