31-03-2025 12:49:00 AM
శుక్రవారం సంభవించిన భూకంపాలతో 334 అణుబాంబుల శక్తి విడుదల
మాండలే, మార్చి 30: భూకంపాల ధాటికి అతలాకుతలం అవుతున్న మయన్మార్‌ను ఆదివారం మరో భూకంపం వణికించింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరం అయిన మాం డలే సమీపంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే కూడా ధ్రువీకరించింది.
శుక్రవారం సంభవించిన వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు అతలాకుతలం కాగా.. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన వరుస భూకంపాల ధాటికి 1700 మందికి పైచిలుకు మరణించారు. ఆనాటి భూకంపం 334 అణుబాంబులు విడుదల చేసే శక్తిని విడుదల చేసిందని భూగర్భ శాస్త్రవేత్త జెస్ ఫొయెనిక్స్ అభిప్రాయపడ్డారు.
ఈ దేశాల్లో మరిన్ని ప్రకంపన లు వచ్చే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ‘భారత టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్స్ నిరంతరాయంగా ఢీకొనడం వల్ల భవిష్యత్‌లో చాలా రోజుల పాటు ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మయన్మార్‌లో అంతర్యుద్ధం కొనసాగుతున్నందున ఆ దేశ పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది.’
అని ఆమె పేర్కొన్నారు. ఈ విపత్తులో గాయపడ్డ వారి సంఖ్య 3,408కి చేరుకుంది. 139 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఈ విపత్తులో చనిపోయిన వారి సంఖ్య 10వేల పైనే ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. మయన్మార్‌లోని మండాలే నగర సమీపంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. ఈ భూకంప కేంద్ర భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
ఆపన్నహస్తం అందిస్తున్న భారత్
మయన్మార్ విషాదం వేళ.. భారత్ ఆ దేశానికి సాయం చేయడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్‌ను లాంచ్ చేసింన విషయం తెలిసిందే. ఆపరేషన్ ‘బ్రహ్మ’ పేరిట ఆపరేషన్‌ను లాంచ్ చేసిన భారత్ బ్లాంకెట్స్, టార్పాలిన్స్, హైజీన్ కిట్స్, స్లీపింగ్ బ్యాగ్స్, సోలార్ ల్యాం ప్స్, ఆహార పొట్లాలను ఆ దేశానికి పంపింది. అంతేకాకుం డా 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడికి పంపింది. కేవలం భారత్ మాత్రమే కాకుండా అమెరికా, ఇండోనేషియా, చైనా ఇతర దేశాలు కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.