calender_icon.png 23 October, 2024 | 12:02 PM

త్వరలో మరో డీఎస్సీ

15-07-2024 01:27:37 AM

ఐదారు వేల ఖాళీలతో నోటిఫికేషన్

పరీక్షలు వాయిదా కోరడం సరికాదు 

నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. 

16 వేల టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తించాం 

11 వేల టీచర్ 

పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం 

ఇంకా 5 వేలకు పైగా

ఖాళీలు ఉన్నాయి 

గ్రూప్-2 ను ఇప్పటికే మూడుసార్లు 

వాయిదా వేశారు 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టీకరణ 

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రస్తుతం 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతుందని, త్వరలో మరో ఐదారు వేల ఖాళీలకు మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో జరగబోయే పరీక్షలను వాయిదా వేయా లని కోరడం సరికాదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. నిరుద్యోగులు డీఎస్సీతో పాటు మిగతా  పోటీ పరీక్షలకు బాగా సన్నద్ధ్దం కావాలని డిప్యూటీ సీఎం సూచించారు.

ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పేద విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఎన్నికల నోటిఫికేష్ ముందు డీఎస్సీ సాధ్యం కాదన్న గత ప్రభుత్వం.. రాజకీయంగా లబ్ధి పొందడానికి డీఎస్సీ వేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో గ్రూప్ గ్రూప్  డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేదసిందని ఆయన మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం రాగానే మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని భట్టి వివరించారు. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రి య  చివరి దశకు చేరిందన్నారు. ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఆకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరెర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయన్నారు. హాస్ట ల్ వెల్ఫేర్‌కు సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.  తెలంగాణ బిడ్డల జీవితాలు స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ నిర్ణయమని, డీఎస్సీకి ప్రిపేరయ్యే వారు మంచిగా పరీక్షలు రాసి ప్రభుత్వం పాఠశాలల్లో పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలన్నారు. అందుకు ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. 

గత ప్రభుత్వం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్.. 

గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు గతేడాది సెప్టెంబర్ మాసంలో 5 వేల ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 1,75,527 మంది దరఖాస్తులు చేసుకున్నారని భట్టి విక్రమార్క  తెలిపారు. ఆ తర్వాత కాంగ్రె స్  ప్రభుత్వం రాగానే అదనంగా మరో 6 వేల పోస్టులతో కలిపి మొత్తం 11 వేలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రభు త్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే 2 లక్షల 5 వేల మంది వరకు  హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు.

జూలై 18 నుం చి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగుల  సమస్యల పరిష్కారా నికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశామన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీచర్ పోస్టుల ఖాళీలపై లోతుగా అధ్యయనం చేశాకే 11 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మరో ఐదువేల ఖాళీలు ఉన్నాయని, వీటితో పాటు మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్  వేస్తుందన్నారు. 

19 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు.. 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విమర్శంచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. ఇటీవలనే రాష్ట్రంలో 19,717 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు  నిర్వహించామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో తాను సీఎల్పీ నేతగా టీచర్ పోస్టుల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తినట్లు చెప్పారు.

నోటిఫికేషన్లు ఇచ్చినా  ఆ పేపర్ లీకయ్యేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రీ షెడ్యూల్ చేసి మెయిన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది గ్రూప్ వన్ మెయిన్స్‌కు ఎంపికయ్యారని భట్టి వివరించారు. గ్రూప్ పరీక్షను కూడా గత ప్రభుత్వం మూడుసార్లు వాయిదా వేసిందన్నారు. 800 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరీక్షలు నిర్వహించేందుక తేదీలు ఖరారు చేశామని తెలిపారు.  గ్రూప్ పరీక్షలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్ 30వ తేదీన 1,380 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షలు మాత్రం నిర్వహించలేదని భట్టి విమర్శించారు. ఇప్పుడు గ్రూప్ పరీక్షలు నిర్వహించేందుకు నవంబర్ నెలలో తేదీలు కూడా ఖరారు చేశామన్నారు.