calender_icon.png 6 November, 2024 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సిగలో మరో వెలుగుల దివిటీ

15-05-2024 01:44:46 AM

చివరి దశకు వైటీపీపీ పనులు

ప్రస్తుతం విజయవంతంగా ట్రయల్న్

త్వరలో ఐదు యూనిట్లు ప్రారంభం 

4,000 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు

మునుగోడు, మే 14: నల్లగొండ జిల్లా దామెరచర్ల వద్ద 2015లో గత ప్రభుత్వం ప్రారంభించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీపీ) పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. ప్రస్తుతం సీఈలు, ఇంజినీర్ల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ సైతం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం మంగళవారం ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలిపారు.

ప్లాంట్ త్వరలో రాష్ట్రానికి వెలుగులు పంచనున్నది. ప్లాంట్ పరిధిలో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ చొప్పున మొత్తం 40,00 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నది. 2015 జూన్ 8న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 5,558 ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో టీఎస్ జెన్కో, బీహెచ్‌ఈఎల్ సంయుక్తాధ్వర్యంలో పనులు ప్రారంభమైంది.

కానీ ప్లాంట్‌కు అయ్యే ఖర్చు మరింత పెరుతూ వచ్చింది. ప్లాంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.3,100 కోట్లు వెచ్చించింది.  సుమారు 6 వేల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తూ పనులను పూర్తి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ప్లాంట్ అందుబాటులోకి వచ్చి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా కేంద్ర పర్యావరణశాఖ నుంచి కొన్ని అనుమతులు ఆలస్యం కావడంతో పనులు సైతం ఆలస్యమయ్యాయి. 

బొగ్గు తరలించేందుకు 8.5 కిమీ రైల్వేలైన్..

ప్లాంట్ పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు తీసుకొచ్చేందుకు అధికారులు దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైలుమార్గం ఏర్పాటు చేశారు. అడవి దేవులపల్లి సమీపంలోని టెయిల్ పాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించారు. రిజర్వాయర్‌ను ఒకసారి నింపితే 10 రోజులపాటు ప్లాంట్ నీటి అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేశారు. 

కేంద్రం నుంచి అనుమతుల కొర్రీలు

ప్లాంట్ జూన్ కల్లా పూర్తయి రాష్ట్రానికి వెలుగులు పంచాల్సి ఉండగా కేంద్రం నుంచి కొన్ని అనుమతులు ఆలస్యమవడంతో విద్యుత్ ఉత్పత్తికి మరింత సమయం పడుతున్నది. పర్యావరణ అనుమతుల విషయంలో నాన్చుడు ధోరణిని అనుసరించడంతోనే ఈ పరిస్థితి. పైగా అనేక సార్లు పనులు నిలిపివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ ద్వారా నోటీసులు జారీ చేయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు శివారులో ఇప్పటికే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా యాద్రాద్రిలో మాత్రం కేంద్రం కొర్రీలతో పనులు నెమ్మదిగా కొనసాగాయి.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ప్లాంట్ పనులపై దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్లాంట్ పనులపై సంబంధిత అధికారులను సమీక్షించారు. ప్లాంట్ పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన అరకొర పనులను సైతం పూర్తి చేసేందుకు టీఎస్ జెన్కో, బీహెచ్‌ఈఎల్ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కృషి చేస్తున్నారు.