ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది ముక్కుపచ్చలారని చిన్నారులు సజీవ దహనమైన వార్త యావత్తు ప్రజలను మరోసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదం జరిగే సమయంలో ఈ వార్డులో 18 బెడ్స్‌పై 50 మందికి పైగా చిన్నారులున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను పొదువుకొని బైటికి పరుగులు తీశారు.
కొంతమంది తమ పిల్లల గురించి కూడా పట్టించుకోకుండా బెడ్స్‌పై ఉన్న చిన్నారులను కాపాడారు. కృపాల్ సింగ్ అనే వ్యక్తి దాదాపు పాతిక మంది పిల్లలను కాపాడాడు. మరో యువకుడు తన నవజాత కుమారుడు మంటల్లో కాలి బూడిదయినా చాలామంది పిల్లలను కాపాడాడు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పారు. కాపాడిన పిల్లల్లో 16 మంది ఇప్పటికీ మృత్యువుతో పోరాడుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ ఐసీయూ వార్డులో ఓ నర్సు ఆక్సిజన్ పైప్ కనెక్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. పూర్తిస్థాయి దర్యాప్తులో వాస్తవాలు తెలియవచ్చు కానీ రోజుల కిందట ఈ లోకంలోకి వచ్చి ఇంకా పూర్తిగా కళ్లు తెరవని చిన్నారులు శాశ్వతంగా కన్నుమూయడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు హృదయాలను పిండేస్తున్నాయి.
చిన్నారులను గుండెలకు హత్తుకుని బైటికి పరుగులు తీసిన తల్లులు చాలామంది తమ బిడ్డలను మళ్లీ ఆస్పత్రిలో చేర్చమని చెప్పడాన్ని చూస్తే వారు ఎంతగా భయభ్రాంతులయ్యారో అర్థమవుతుంది. ఘటనపై దర్యాప్తులు, మృతుల కుటుంబాలకు ఓదార్పులు, ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియాలు పోయిన ఆ చిన్నారుల ప్రాణాలను మాత్రం తీసుకు రాలేవు. యూపీలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లో అతిపెద్ద ఆస్పత్రి అయిన లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఈ ఘోరప్రమాదం ఈ ఏడాది ఢిల్లీ వివేక్ విహార్‌లోని నవజాత శిశువుల ఆస్పత్రిలో సంభవించిన అగ్నిప్రమాదాన్ని మరోసారి గుర్తుకు తెస్తోంది.
గత మే 26న ఆ ఆస్పత్రిలో జరిగిన ఇదే విధమైన అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు అసువులు బాశారు. అలాగే 2021 జనవరిలో మహారాష్ట్ర బాంద్రాలోని ఓ ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డులో అర్ధరాత్రి చెలరేగిన మంటల్లో ఆస్పత్రిలో చేర్చిన 17 మంది చిన్నారుల్లో 10 మంది కాలి బూడిదయ్యారు. చివరికి మన హైదరాబాద్‌లోని చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫిర్‌లో కూడా గతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
2011లో కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు. అండర్‌గ్రౌండ్ కారు పార్కింగ్ స్థలంలో అక్రమంగా నిల్వ ఉంచిన మండే స్వభావం ఉండే పదార్థాల కారణంగా చెలరేగిన మంటల్లో 94 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో దాదాపు 90 మంది రోగులే. కొవిడ్ మహమ్మారి సమయంలో విజయవాడలో కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చిన ఓ హోటల్‌లో మంటల్లో చిక్కి 11 మంది రోగులు విగతజీవులయ్యారు.
అదే సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆస్పత్రిలోని ఓ కొవిడ్ రోగుల వార్డులో చెలరేగిన మంటలు 8 మంది రోగులను బలి తీసుకున్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. ప్రాణాలు కాపాడతారన్న భరోసాతో ఆస్పత్రులకు వచ్చే వారి ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక దిక్కెవరు? ప్రమాదాలు చెప్పి రావనేది నిజమే కానీ నిత్యం పర్యవేక్షణ, వందలాదిమంది చికిత్స పొందే ఆస్పత్రుల్లో చోటు చేసుకునే ఇలాంటి ప్రమాదాలు విగతజీవుల కుటుంబ సభ్యులకు గర్భశోకాన్ని మిగల్చడమే కాదు, జీవితమంతా వారిని ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.