పోలీసుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుంటున్న ఇరు రాష్ట్రాల అధికారులు
- కుడికాల్వ నీటిమట్టం నమోదుకు వెళ్లిన తెలంగాణ అధికారులు
- అడ్డుకున్న ఏపీ అధికారులు
- కేఆర్‌ఎంబీకి తెలంగాణ అధికారుల ఫిర్యాదు
- ఇరు రాష్ట్రాల అధికారులకు సర్ది చెప్పిన కేఆర్‌ఎంబీ
నల్లగొండ, నవంబర్ 9 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అధికారుల మధ్య శనివారం మరోసారి వివాదం చోటు చేసుకుంది. కుడి కాల్వ నీటి మట్టాన్ని నమోదు చేసేందుకు వెళ్లిన తెలంగాణ అధికారులను ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రీడింగ్ నమోదుకు ఏపీ అధికారులు ససేమిరా అనడంతో ఒకరినొకరు తోసుకునేంత వరకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఘటనపై తెలంగాణ అధికారులు వెంటనే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన కేఆర్‌ఎంబీ ఇరు రాష్ట్రాల అధికారులకు సర్ది చెప్పింది. కాగా విషయంపై ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చించి కుడికాల్వ 0.7 కిలోమీటర్ వద్ద నీటిమట్టం వివరాల నమోదుకు తెలంగాణ అధికారులకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. రోజువారీగా ఇరురాష్ట్రాల అధికారులు యథాతథంగా నీటిమ ట్టాలు నమోదు చేసుకునేలా సహకరించుకోవాలని సయోధ్యకు వచ్చినట్లు సమాచారం.
గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల రోజే నాగార్జున సాగర్‌లో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో ఏపీ నీటి పారుదల అధికారులు సాగర్ 13వ గేటు నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఏపీ పోలీసులు కలగజేసుకోవడంతో ఇరు రాష్ట్రాల పోలీసుల నడుమ తీవ్ర ఘర్షణ తలెత్తింది. దీంతో డ్యామ్‌కు ఇరువైపులా ముళ్ల కంచెలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
విషయంపై అప్పట్లో కేంద్ర జలశక్తి సంఘం, కేఆర్‌ఎంబీ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే చూస్తున్నది. సాగర్‌లో 26 గేట్లకు 1 నుంచి 13 గేట్లు తెలంగాణ, 14-26 గేట్లను ఏపీ అధికారులు నిర్వహిస్తున్నారు. నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులు పంతాలకు పోతుండ టంతో తరచూ వాగ్వాదం జరుగుతున్నది.